రివ్యూ: రాజు గారి గ‌ది 2

తెలుగు360.కామ్ రేటింగ్ : 3/5

తెలుగులో స్టార్ క‌థానాయ‌కులు హార‌ర్ కామెడీ క‌థ‌ల్లో న‌టించ‌డం అరుదు. వాటిలో హీరోయిజం ఏముంటుంద‌నే ఓ అభిప్రాయంవ‌ల్ల కావొచ్చు. కానీ కొత్త ప్ర‌య‌త్నాలు చేయ‌డంలో ముందుండే నాగార్జున తొలిసారి హార‌ర్ కామెడీతో కూడిన `రాజుగారి గ‌ది2`లో న‌టించారు. విజ‌య‌వంత‌మైన రాజుగారి గ‌దికి సీక్వెల్ కావ‌డం, అందులో మామాకోడ‌ళ్లు నాగార్జున‌, స‌మంత ఉండ‌టంతో పాటు… స‌మంత పెళ్లి త‌ర్వాత విడుద‌ల‌వుతున్న చిత్రం కూడా ఇదే కావ‌డంతో అంద‌రి దృష్టీ బాక్సాఫీసుపైకి మ‌ళ్లింది. స‌మంత ఈ త‌ర‌హా క‌థ చేయ‌డం కూడా ఇదే తొలిసారి. మ‌రి ఇన్ని ప్ర‌త్యేక‌త‌లున్న సినిమా ప్రేక్ష‌కుల్ని ఏ మేర‌కు మెప్పించింది? అంచ‌నాల స్థాయిలో ఓంకార్ చిత్రాన్ని తీర్చిదిద్దాడా లేదా? తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే…

* క‌థ‌

రుద్ర (నాగార్జున) ఓ మోడ్ర‌న్ సెయింట్‌. ఎదుటి వ్య‌క్తి మ‌న‌సులో ఏముందో క‌ళ్ల‌ల్లో చూసి క‌నిపెడ‌తాడు. ఓ గొప్ప మెంట‌లిస్ట్‌గా పేరు తెచ్చుకొన్న ఆయ‌న పోలీసుల‌కి కూడా ప‌లు చిక్కుముడుల‌తో కూడిన కేసుల విష‌యంలో సాయ‌ప‌డుతుంటాడు. అలాంటి రుద్ర‌ని చ‌ర్చి ఫాద‌ర్ (న‌రేష్‌) ఓ విష‌యంలో సంప్ర‌దిస్తాడు. ప్రాణ స్నేహితులైన అశ్విన్ (అశ్విన్‌) కిషోర్ (వెన్నెల కిషోర్‌), ప్ర‌వీణ్ (ప్ర‌వీణ్‌) క‌లిసి స‌ముద్ర తీరంలో రాజుగారి రిసార్ట్‌ని కొనుగోలు చేస్తారు. కానీ అందులో ఓ దెయ్యం వాళ్ల‌ని భ‌య‌భ్రాంతుల‌కి గురిచేస్తుంటుంది. అస‌లు రిసార్ట్‌లో ఉన్న‌ది దెయ్య‌మేనా కాదా? అక్క‌డ అస‌లు ఏం జ‌రుగుతోంద‌నే విష‌యాన్ని క‌నిపెట్ట‌మ‌ని రుద్ర‌ని కోర‌తాడు. రిసార్ట్‌లోకి అడుగుపెట్టిన రుద్ర‌కి అమృత (స‌మంత‌) అనే అమ్మాయి ఆత్మ క‌నిపిస్తుంది. ఆమె ప్ర‌తీకారం కోరుకొంటోంద‌నే విష‌యం తెలుస్తుంది. అస‌లు అమృత ఎవ‌రు? ఆమె ప్ర‌తీకారం ఎవ‌రిపైన‌? రిసార్ట్‌లోని ఆ ముగ్గురినీ ఎందుకు భ‌య‌పెడుతుంది? ఆ ఆత్మ‌కి రుద్ర ఎలా సాయం చేశాడు? అమృత‌కీ, రిసార్ట్‌లో ఉన్న సుహాన‌స (శీర‌త్‌క‌పూర్‌)కీ సంబంధ‌మేంటి? అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

* విశ్లేష‌ణ

క‌థ‌కి దూరం జ‌ర‌గ‌కుండా… అందులో ఉంటూనే మాస్ అంశాల‌తో చిత్రాన్ని తీర్చిదిద్దాడు ద‌ర్శ‌కుడు ఓంకార్‌. అక్క‌డే ఆయ‌న స‌గం విజ‌యం సాధించాడు. నాగార్జున‌, స‌మంత‌లాంటి స్టార్లున్న సినిమా కాబ‌ట్టి ఆ త‌ర‌హా ప్ర‌య‌త్నం చేయ‌డం ఓ మంచి ఆలోచ‌న‌. ఒక ప‌క్క మాస్‌కి న‌చ్చే హార‌ర్‌, కామెడీ ఎంలిమెంట్స్‌తో పాటు… కుటుంబ ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా క‌థని మ‌లచ‌డం సినిమాకి ప్ల‌స్స‌యింది. ఆరంభ స‌న్నివేశాలు చ‌ప్ప‌గానే మొద‌ల‌వుతాయి. వెన్నెల కిషోర్‌, ప్ర‌వీణ్‌, అశ్విన్ స్నేహితుల మ‌ధ్య స‌న్నివేశాలు యువ‌త‌రాన్ని టార్గెట్ చేసి తెర‌కెక్కించిన‌వే. అయితే చాలా స‌న్నివేశాలు, సంభాష‌ణ‌లు పాత సినిమాల్లో చూసినవే కావ‌డంతో అవి చ‌ప్ప‌గా సాగుతున్న‌ట్టు అనిపిస్తాయి. అయితే ఎప్పుడైతే ఆ ముగ్గురిలో ఒకొక్కరినీ దెయ్యం భ‌య పెట్ట‌డం ఆరంభిస్తుందో అప్ప‌ట్నుంచి క‌థ ఆస‌క్తిక‌రంగా మారిపోతుంది. భ‌య‌పెట్టే విధానం, అక్క‌డ విజువ‌ల్ ఎఫెక్ట్స్‌ని వాడుకొనే విధానం కూడా కొత్త‌గా అనిపిస్తుంది.

నాగార్జున వ‌చ్చాక క‌థ మ‌రింత వేగం పుంజుకొంటుంది. ఆయ‌న పాత్ర ప‌రిచ‌య‌మైన వెంట‌నే ఓ కేసు చిక్కుముడిని విప్పే విధానం చాలా బాగుంటుంది. ఆ స‌న్నివేశాల‌తో ప్రేక్ష‌కుడు పూర్తిగా క‌థ‌లో లీన‌మైపోతాడు. దెయ్యం అన్వేష‌ణ‌లో దిగాక క‌థ అడుగ‌డుగునా ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. ఫ‌స్ట్‌హాఫ్‌తో పోలిస్తే సెకండ్ హాఫ్ క‌థే సినిమాకి కీల‌కం. అమృత నేప‌థ్యం, ఆమె ఆత్మ‌గా ఎందుకు మారింది? ఆమె ప్ర‌తీకారం ఎవ‌రిపై? అనే విష‌యాలతో పాటు, ఆమెని ఇబ్బంది పెట్టిన‌వాళ్లు ఎవ‌రు? వాళ్ల ల‌క్ష్యం ఏంటి? ఎందుకు చేశారు? ఏం లాభం పొందారు? అనే విష‌యాలూ ద్వితీయార్థంలోనే ఉంటాయి. అమృత కేసు విషయంలో ప‌రిశోధ‌న‌కి దిగిన రుద్ర‌కి ఎదుర‌య్యే ప‌రిస్థితులు, తెలిసే నిజాలు ప్రేక్ష‌కుల‌కి థ్రిల్‌ని క‌లిగిస్తాయి. అదంతా ఒకెత్తైతే, ప‌తాక స‌న్నివేశాలు మ‌రో ఎత్తు. అక్క‌డ 20 నిమిషాల పాటు స‌న్నివేశాలు సందేశాత్మ‌కంగా సాగుతూనే, భావోద్వేగాల్నీ పండిస్తాయి. ఎవ‌రూ ఊహించ‌ని విల‌న్ పాత్ర ఆ స‌న్నివేశాల్లో క‌నిపించి ప్రేక్ష‌కుల్నిఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. అవ‌డానికి ఇదొక రీమేక్ క‌థే అయినా… దాన్ని తెలివిగా తెలుగీక‌రించి, స‌న్నివేశాల్ని రాసుకొన్నాడు ఓంకార్‌. నాగార్జున, స‌మంత‌లకి కొత్త పాత్ర‌లు కావ‌డం, వాటిలో వాళ్లు క‌నిపించిన విధానం ప్రేక్ష‌కుల‌కూ కొత్త‌ద‌నాన్ని పంచింది.

* న‌టీన‌టుల ప్ర‌తిభ‌

నాగార్జున‌, స‌మంత‌, అభిన‌యల పాత్ర‌లు, న‌ట‌న ప్రేక్ష‌కుల్ని థ్రిల్‌కి గురిచేస్తాయి. నిజానికి నాగార్జున స్థాయి హీరోయిజం ఈ సినిమాలో ఉండ‌దు. కానీ ఓంకార్ రుద్ర పాత్ర‌ని స్టైలిష్‌గా చూపిస్తూ హీరోయిజాన్ని పండించే ప్ర‌య‌త్నం చేశాడు. స‌మంత న‌ట‌న సినిమాకి ప్ర‌ధాన బ‌లం. ఆమె సీరియ‌స్‌గా క‌నిపిస్తూ, భావోద్వేగాల్ని పండించిన విధానం న‌ట‌న‌లో ప‌రిణ‌తికి అద్దం ప‌డుతుంది. అభిన‌య ఇందులో అలా క‌నిపిస్తుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌రు. కానీ ఆమె న‌ట‌న ప‌తాక స‌న్నివేశాల‌కి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. సీర‌త్ క‌పూర్ అందాలు ఆర‌బోసి సినిమాకి గ్లామ‌ర్‌ని తెచ్చింది. వెన్నెల‌కిషోర్‌, అశ్విన్‌, ప్ర‌వీణ్‌ల పాత్ర‌లు అక్క‌డ‌క్క‌డ న‌వ్వించాయి. ష‌క‌ల‌క శంక‌ర్‌, న‌రేష్ ఉన్న‌ప్ప‌టికీ కాసిన్ని కామెడీ స‌న్నివేశాల కోస‌మే వాళ్ల‌ని ఉప‌యోగించుకొన్నారు త‌ప్ప ఆ పాత్ర‌ల‌కి క‌థ‌లో పెద్ద‌గా ప్రాధాన్యం లేదు. రావు ర‌మేష్ స‌మంత‌కి తండ్రిగా క‌నిపించారు.

* సాంకేతిక‌త‌

ఓంకార్ తొలిసారి స్టార్ల‌తో సినిమా తీస్తున్నా ఎక్క‌డా త‌డ‌బ‌డ‌కుండా క‌థ‌తో పాటే ప్ర‌యాణం చేశాడు. ఎమోష‌న్స్ విష‌యంలోనూ, పాత్రీక‌ర‌ణ‌లోనూ, న‌ట‌న రాబ‌ట్టుకోవ‌డంలోనూ ఆయ‌న ప‌నిత‌నం స్ప‌ష్టంగా క‌నిపించింది. ప‌తాక స‌న్నివేశాల్ని చాలా బాగా డిజైన్ చేసుకొన్నాడు. అలాగే విజువ‌ల్ ఎఫెక్ట్స్‌ని వాడుకొన్న విధానం కూడా చాలా బాగుంది. రాజుగారి గ‌దితో విజ‌యాన్ని అందుకొన్న ఆయ‌న, అంచ‌నాల‌కి త‌గ్గ‌ట్టుగానే రెండో చిత్రం తీశాడు. ప్ర‌థ‌మార్థం విష‌యంలోనై కొన్ని కంప్ల‌యింట్లు త‌ప్పిస్తే మిగ‌తా సినిమాని బాగానే తీశాడు. అయితే ఈ సినిమాకి రాజుగారి గ‌ది అనే టైటిల్ ఎందుకు వాడుకొన్నారా అనిపిస్తోంది. ఈ సినిమాకి మ‌రింత ఆక‌ర్ష‌ణీయ‌మైన టైటిల్ పెట్టి, హార‌ర్ కామెడీ అనే ట‌చ్ ఇవ్వ‌కుండా జాగ్ర‌త్త ప‌డితే మ‌రింత బాగుండేది. త‌మ‌న్ నేప‌థ్య సంగీతం, దివాక‌ర‌న్ కెమెరా ప‌నిత‌నం సినిమా మూడ్‌ని మ‌రింత ఎలివేట్ చేశాయి. అబ్బూరి ర‌వి మాట‌లు ప‌తాక స‌న్నివేశాల్లో చాలా బాగున్నాయి.

తెలుగు360.కామ్ రేటింగ్ : 3/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.