ఈమధ్య చిన్న సినిమాల పరిస్థితి ఘోరంగా తయారైంది. ఓటీటీ హక్కులు అమ్ముడు పోవడం లేదు. జనాలు థియేటర్లకు రావడం లేదు. థియేట్రికల్ రైట్స్ కూడా అంతే. ఓ చిన్న సినిమాకు టేబుల్ ప్రాఫిట్ రావడం.. అరుదైన అద్భుతంగా మారిపోయింది. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ‘రాకాస’ అనే సినిమా విడుదలకు ముందే నిర్మాతల్ని సేఫ్ జోన్లో పడేయడమే కాకుండా, లాభాల బాట పట్టించింది.
సంగీత్ శోభన్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ఏప్రిల్ 3న విడుదల కాబోతోంది. నిహారిక కొణిదెల నిర్మాత. ఓటీటీ హక్కుల్ని నెట్ ఫ్లిక్స్ రూ.10 కోట్లకు కొనుగోలు చేసింది. ఆడియో రైట్స్ ని సరిగమ చేజిక్కించుకొంది. ఇప్పుడు ఏపీ, తెలంగాణ హక్కుల్ని శ్రీ లక్ష్మీ నరసింహా మూవీస్ సంస్థ మంచి రేటుకి కొనుగోలు చేసింది. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు మంచి రిలీజ్ దక్కుతోంది. అక్కడ దాదాపు 350 స్క్రీన్స్ లో ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. ఎలా చూసినా… ‘రాకాస’ మంచి బజ్ క్రియేట్ చేయగలిగింది. ఈమధ్య విడుదలైన టీజర్ ఆకట్టుకొంది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా వైవిధ్యభరితంగా చేస్తున్నారు. హారర్ కామెడీ జోనర్ కి మంచి గిరాకీ ఉంది. క్లిక్ అయితే కాసుల వర్షం కురుస్తుంది. పైగా సంగీత్ శోభన్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. తను చేసిన మ్యాడ్, మ్యాడ్ 2 సినిమాలు మంచి విజయాన్ని అందుకొన్నాయి. ఇప్పుడు `రాకాస` కూడా అదే దారిలో విజయం సాధిస్తుందన్నది అందరి నమ్మకం. అందుకే… థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ చేసుకోగలిగింది.


