ఈరోజు రామ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన కొత్త సినిమా టైటిల్ ప్రకటించారు. ముందు నుంచీ అనుకొంటున్నట్టుగానే ఈ సినిమాకు ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ అనే టైటిల్ ఖరారు చేశారు. మహేష్ ఈ చిత్రానికి దర్శకుడు. గ్లింప్స్ లో.. కథేమిటన్నది స్పష్టమైంది. సూర్య అనే ఓ సూపర్ స్టార్‌ని ‘ఆంధ్రా కింగ్’ అని పిలుస్తుంటారు. తన అభిమాని కథ ఇది. ఓ ఫ్యాన్ బయోపిక్ అన్నమాట. ఈ సినిమాలో అప్పట్లో ఫ్యాన్ వార్స్ ఎలా జరిగేవి? అనే విషయాన్ని సైతం చూపించబోతున్నార్ట. ఇప్పుడంటే హీరోల అభిమానులు సోషల్ మీడియా సాక్షిగా కొట్టుకొంటున్నారు. అప్పుడు ఇలా ఉండేది కాదు. అభిమానుల మధ్య యుద్ధాలు వేరే రేంజ్లో జరిగేవి. వాటన్నింటినీ ఈ సినిమాలో చూపించబోతున్నారని తెలుస్తోంది. అంతేకాదు… హీరో తన ఊరి ప్రజల కోసం ఏం చేశాడన్న కాన్సెప్ట్ కూడా ఈ కథలో భాగంగా రానుంది. ఊరి ప్రజలు కరెంట్ లేక కష్టాలు పడుతొంటే, హీరో దాన్ని ఎలా సాధించాడన్నది చూపించబోతున్నారు. హీరో – ఫ్యాన్ మధ్య జరిగే డ్రామా కూడా చాలా ఇంట్రస్టింగ్ గా ఉండబోతోందట. కథగా కొత్తగానే అనిపిస్తోంది. నేపథ్యం కూడా ఇది వరకు చూడనిదే. కాబట్టి..ఫ్రెష్ ఫీల్ రావడం గ్యారెంటీ. రామ్ లో ఎనర్జీనీ, తన ఎంటర్టైన్మెంట్ లెవల్స్ నీ సరిగా వాడుకొంటే.. మంచి హిట్టు కొట్టినట్టే.
ఉపేంద్ర పాత్ర కోసం చాలామంది పేర్లు పరిశీలించారు. ఓ దశలో బాలకృష్ణతో ఈ రోల్ చేయిద్దామనుకొన్నారు. కానీ కుదర్లేదు. ఉపేంద్ర లుక్, తన క్యారెక్టరైజేషన్ చాలా సర్ప్రైజింగ్ గా ఉండబోతున్నాయట. భాగశ్రీ బోర్సే ఈ సినిమాలో కథానాయిక. త్వరలోనే తొలి పాటని విడుదల చేయబోతున్నారు. మరోవైపు విశ్వక్సేన్ ‘ఫంకీ’ అనే ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా కూడా సినిమా నేపథ్యంలో సాగే కథే. దానికీ, ఈ సినిమాకీ ఏమైనా లింకు ఉందేమో చూడాలి.