గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా రిపబ్లిక్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తండ్రి మెగాస్టా్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మెగాస్టార్ విజయాల వెనుక ఉన్న అసలు రహస్యం ఆయన క్రమశిక్షణేనని చరణ్ వెల్లడించాడు. తన తండ్రి రోజువారీ జీవనశైలిని ఉదాహరణగా చెబుతూ.. “నాన్న ఇప్పటికీ ఉదయం ఐదు గంటలకే లేస్తారు. ఆ తర్వాత నేరుగా జిమ్‌కి వెళ్తారు. ఆరింటికల్లా కాఫీ తాగేస్తారు. చాలాసార్లు జిమ్‌లోనే కాఫీ తాగుతూ వర్కౌట్స్ పూర్తి చేస్తారు. ఆయన జీవితంలో క్రమశిక్షణకు ఎంత ప్రాధాన్యం ఉందో ఈ అలవాట్లే చెబుతాయి” అని రామ్ చరణ్ పేర్కొన్నాడు. 75 ఏళ్ల వయసు దాటినా చిరంజీవి తన ఫిట్నెస్ విషయంలో ఏమాత్రం రాజీ పడరని చరణ్ చెప్పాడు. కొత్త తరం నటులు కూడా ఆశ్చర్యపడే స్థాయిలో ఆయన ఎనర్జీ ఉంటుందని, దానికి ప్రధాన కారణం ఆయన దశాబ్దాలుగా పాటిస్తున్న జీవనశైలి అని వివరించాడు.
అంతేకాదు, కుటుంబ సభ్యులను కూడా ఆరోగ్యంగా ఉండేలా ఎప్పుడూ ప్రోత్సహిస్తుంటారని చరణ్ తెలిపాడు.
ముఖ్యంగా ప్రతి శనివారం కుటుంబ సభ్యులందరికీ ఫోన్ చేసి ఆరోగ్యం గురించి అడగడం, వ్యాయామం చేస్తున్నారా లేదా తెలుసుకోవడం, ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని చెప్పడం ఆయన అలవాటుగా మారిందని వెల్లడించాడు. కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యంపై నిర్లక్ష్యం కనిపిస్తే వెంటనే సూచనలు చేస్తారని చెప్పాడు.
రామ్ చరణ్ మాటల్లో, చిరంజీవి కేవలం ఒక స్టార్ హీరో మాత్రమే కాదు.. కుటుంబానికి ఒక మార్గదర్శి కూడా. తాను చిన్నప్పటి నుంచి ఆయనను గమనిస్తూ పెరిగానని, కష్టపడే తత్వం, సమయపాలన, శారీరక దృఢత్వం వంటి విలువలు ఆయన నుంచే నేర్చుకున్నానని చెప్పాడు.
ఇంట్లో తండ్రిగా కనిపించే చిరంజీవి.. పని విషయంలో మాత్రం పూర్తిగా భిన్నమని చరణ్ తెలిపాడు. సెట్స్‌లో ఆయన అంకితభావం చూస్తే ఇప్పటికీ తాను ఆశ్చర్యపోతానని అన్నాడు. ఎన్నో దశాబ్దాల కెరీర్, అపారమైన స్టార్డమ్ వచ్చిన తర్వాత కూడా అదే ఉత్సాహంతో పనిచేయడం నిజంగా స్ఫూర్తిదాయకమని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలతో మెగాస్టార్ విజయాల వెనుక ఉన్న అసలు బలం ప్రతిభ మాత్రమే కాదని, దానికి తోడు క్రమశిక్షణ, ఫిట్నెస్, ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా కీలక పాత్ర పోషించాయని మరోసారి స్పష్టమైంది. రామ్ చరణ్ చెప్పిన ఈ విషయాలు అభిమానులకు మాత్రమే కాదు, యువతకు కూడా ఒక ప్రేరణగా నిలుస్తున్నాయి.
