భారతీయ సినిమాలపై ఓటీటీ వేదికలు చూపిస్తున్న ప్రభావం గురించి కథానాయకుడు రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా RRR ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడంలో ఓటీటీ కీలక పాత్ర పోషించిందన్నారు చరణ్ రిపబ్లిక్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓటీటీల ప్రభావం గురించిన చర్చ వచ్చింది. ఈ సంద్భంగా చరణ్ ఓటీటీల ఎఫెక్ట్ గురించి కొంత విపులంగాటనే మాట్లాడారు. చాలామంది ఓటీటీల నెగిటీవ్ సైడ్ గురించి మాట్లాడతారు. కానీ చరణ్ అందులోని పాజిటీవ్ కోణాన్ని చూపించాడు. “మా సినిమా ఆస్కార్ వరకు వెళ్లిన ప్రయాణంలో నెట్ఫ్లిక్స్ పాత్రను విస్మరించలేం. థియేటర్లలో విడుదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రేక్షకులు ఆ చిత్రాన్ని నెట్ఫ్లిక్స్ ద్వారా చూశారు. అమెరికా, యూరప్, జపాన్ వంటి దేశాల్లో ప్రేక్షకులు సినిమాను కనుగొనడానికి ఓటీటీ ఒక వేదికగా మారింది” అని తెలిపారు.
ఒకప్పుడు భారతీయ సినిమాలు విదేశీ ప్రేక్షకులకు చేరుకోవడం అంత సులభం కాదని, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చరణ్ అభిప్రాయపడ్డారు చరణ్. ఓటీటీ వేదికలు భాషల మధ్య ఉన్న గోడలను కూల్చేశాయని, మంచి కంటెంట్ ఉంటే అది ప్రపంచంలోని ఏ మూలకైనా చేరుకుంటోందని చెప్పారు.
చరణ్ వ్యాఖ్యల్లో ఓ కీలక అంశం కనిపించింది. ఆయన దృష్టిలో ఓటీటీలు థియేటర్లకు ప్రత్యామ్నాయం కాదు. అవి సినిమాల పరిధిని విస్తరించే కొత్త మాధ్యమం. ఒక సినిమా థియేటర్లలో తన ప్రయాణాన్ని పూర్తి చేసిన తర్వాత మరింత పెద్ద ప్రేక్షక వర్గాన్ని చేరుకోవడానికి ఓటీటీలు సహకరిస్తున్నాయన్నది చరణ్ మాట.
ప్రస్తుతం ప్రపంచ ప్రేక్షకుల అభిరుచులు వేగంగా మారుతున్నాయని, ప్రేక్షకులు భాషను కాదు కథను చూస్తున్నారని చరణ్ పేర్కొన్నారు. అందుకే భారతీయ సినీ పరిశ్రమకు ఇది ఒక గొప్ప అవకాశం అని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ అనే తేడాలు క్రమంగా తగ్గిపోతుండగా, మంచి కథలకు అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ పెరుగుతోందని చెప్పారు. ఆర్ఆర్ఆర్ సాధించిన ప్రపంచవ్యాప్త విజయాన్ని ఉదాహరణగా చూపుతూ, ఓటీటీలు భారతీయ సినిమాలను కొత్త మార్కెట్లకు పరిచయం చేశాయని చరణ్ అన్నారు. ఒకప్పుడు హాలీవుడ్ చిత్రాలకు మాత్రమే దక్కే అంతర్జాతీయ చర్చ ఇప్పుడు భారతీయ సినిమాలకు కూడా దక్కుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
చరణ్ మాటల్లో స్పష్టంగా కనిపించిన విషయం ఏమిటంటే, భవిష్యత్తులో సినిమా పరిశ్రమ థియేటర్లు, ఓటీటీలు రెండింటినీ సమతుల్యంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. థియేటర్ అనుభవం ఎప్పటికీ ప్రత్యేకమే అయినప్పటికీ, ప్రపంచవ్యాప్త గుర్తింపు సాధించడంలో ఓటీటీలు ఇప్పుడు కీలక భాగస్వాములుగా మారాయని ఆయన అభిప్రాయం. ఆస్కార్ వేదిక వరకు వెళ్లిన ఆర్ఆర్ఆర్ ప్రయాణాన్ని గుర్తు చేస్తూ చరణ్ చేసిన ఈ వ్యాఖ్యలు, భారతీయ సినిమాల గ్లోబల్ విస్తరణలో ఓటీటీల పాత్ర ఎంత కీలకంగా మారిందో మరోసారి చర్చకు తెరలేపాయి.
