అఖిల్‌ని పెంచుకుందాం అనుకున్నాం: చిరంజీవి

అక్కినేని కుటుంబానికి మెగా కుటుంబానికీ ఉన్న అనుబంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. నాగ్ – చిరు ఇద్ద‌రూ మంచి దోస్తులు. ఆ స్నేహంతోనే హ‌లో.. ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కి చిరు, చ‌ర‌ణ్‌లు హాజ‌ర‌య్యారు. అంతే కాదు.. చిరు కుంటుబం హ‌లో సినిమాని బుధ‌వారం ఉద‌యం ప్ర‌త్యేకంగా ప్ర‌ద‌ర్శించారు కూడా. ఈ విష‌యాన్ని హ‌లో ప్రీ రిలీజ్ వేడుక‌లో చిరునే స్వ‌యంగా చెప్పాడు. అంతే కాదు.. అక్కినేని కుటుంబంతో.. త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. అఖిల్ బంగారం అని.. త‌న‌లాంటి కొడుకు ద‌క్క‌డం నాగ్‌, అమ‌లల అదృష్ట‌మ‌న్నాడు చిరు. అఖిల్‌ని చూస్తే చ‌ర‌ణ్‌కి ఓ త‌మ్ముడో, అన్నో ఉంటే బాగుండేది అన్న ఫీలింగ్ వ‌చ్చేద‌ట‌. ఆ స‌మ‌యంలో అఖిల్‌ని పెంచుకోవాల‌నికూడా అనిపించేద‌ని చెప్పుకొచ్చాడు చిరు. ఈ ఫంక్ష‌న్‌లో చిరు ఏమ‌న్నాడో కాస్త క్లుప్తంగా..

“ఈ హ‌లో అనే టైటిల్‌.. ఈ సినిమా పెట్ట‌డం ఆ ఐడియా ఎవ‌రిదో గానీ వాళ్ల‌కు హ్యాట్సాఫ్ చెప్పాలి. సెల్‌ఫోన్ ఎవ‌రి చేతుల్లో ఉంటుందో.. వాళ్లంతా ప‌లికే ప‌దం… ఈ హ‌లో. ఈ హ‌లోకి అక్కినేని కుటుంబానికి అవినావ‌భావ సంబంధం ఉంది. హ‌లో హ‌లో ఓ అమ్మాయి.. పాత రోజులు మారాయి… అని ఎప్పుడో అక్కినేని ఓ గీతాన్ని ఆల‌పించారు. ఆ పాట ఇప్ప‌టికీ మ‌ర్చిపోలేం. హ‌లో గురూ…. అంటూ నాగ్‌, అమ‌ల పాడుకున్నారు. హలో బ్ర‌దర్‌లో లో మా బ్ర‌ద‌ర్‌ నాగ్ న‌టించాడు. ఇప్పుడు అఖిల్ హ‌లో అంటూ ప‌ల‌క‌రించ‌డానికి వ‌స్తున్నాడు. గ్ర‌హంబెల్ తొలిసారి ఫోన్ క‌నిపెట్టి.. త‌న ప్రియురాలిని హ‌లో అని పిలిచాడు. అక్క‌డి నుంచి త‌ర‌త‌రాలుగా ఈ ప‌దం నానుతూనే ఉంది. పొద్దుట సినిమా చూశా. విడుద‌ల‌కు ముందు సినిమా చూడ‌డం చిన్న ప‌రీక్ష‌లాంటిది. బాగుందా, బాగోలేదా? ఏం చెప్పాలో తెలీదు. అబ‌ద్దం ఆడ‌లేం. లేనిది క‌ల్పించి చెప్పలేం. సినిమా చూశాక‌.. చెబుతున్నా… అద్భుత‌మైన ప్రేమ‌క‌థ‌. క్లీన్ సినిమా. చాలా చ‌క్క‌గా ఉంది. విక్ర‌మ్ అద్భుత‌మైన ప‌నిత‌నం చూపించాడు. అక్కినేని ఆఖ‌రి సినిమా చ‌రిత్ర‌లో నిలిచిపోయేలా చేశాడు విక్ర‌మ్‌. మ‌రో కోణంలో ఈ ప్రేమ‌క‌థ‌ని ఆవిష్క‌రించాడు. అఖిల్ తొలి సినిమా కూడా చూశా. డాన్సులు ఇర‌గీశాడు. ఫైట్స్ చించేశాడు. అంత స్టామినా ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో అని ఆశ్చ‌ర్య‌పోయా. ఈ సినిమాలో మెచ్యూర్డ్ గా న‌టించాడు. ఈ సినిమాతో మ‌రో మెట్టు ఎదిగాడు. ఓ సీన్ లో అఖిల్ న‌ట‌న చూసి క‌ళ్లు చ‌మ‌ర్చాయి. ఈ సినిమా ప్ర‌తి ఒక్క‌రి గుండెల్నీ తాకుతుంది. తాత‌గారి జీన్స్ అఖిల్‌లో ఉన్నాయి“ అన్నాడు చిరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.