కౌబోయ్ సినిమాలకు ఒకప్పుడు భలే గిరాకీ. ఈ జోనర్‌ని టాలీవుడ్‌కి పరిచయం చేసిన కృష్ణ.. తన ఖాతాలో మోసగాళ్లకు మోసగాడులాంటి హిట్ సినిమాల్ని వేసుకొన్నాడు. ఆ పరంపరలో చాలా సినిమాలొచ్చాయి. చిరంజీవి కొదమ సింహం అందులో ఒకటి. ఆ సినిమా బాగానే ఆడింది. పాటలూ సూపర్ హిట్. ఈతరంలో మహేష్ బాబు టక్కరి దొంగని కౌబోయ్ సినిమాల లిస్టులో చేర్చవొచ్చు. అయితే ఆ తరవాత ఈ జోనర్‌ని ఎవ్వరూ ముట్టుకోలేదు. ఇప్పుడు రామ్‌చరణ్‌కి ఈ టైపు సినిమా ఒకటి చేయాలని ఉందట. కొదమ సింహంలా అవుట్ అండ్ అవుట్ కౌబోయ్ సినిమా చేయాలని ఉందని తన సన్నిహితులతో చరణ్ చెబుతున్నాడని సమాచారం.
ఈమధ్య ఓ యువ దర్శకుడు చరణ్‌ని కలసి కథ చెప్పాడట. అందులో కౌబోయ్ తరహా ఎపిసోడ్ ఒకటి ఉందని తెలుస్తోంది. ”ఈ ఎపిసోడ్‌ని ఇంకాస్త పొడిగించి.. పూర్తిగా కౌబోయ్ తరహా ఫ్లేవర్ వచ్చేలా చూడు” అంటూ చరణ్ సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. చరణ్ ఆఫర్ ఇవ్వడం, అదీ ఓ కొత్త దర్శకుడికి… అంతకంటే ఏం కావాలి. అందుకే ఆ దర్శకుడు కూడా చరణ్ సూచన పాటించాలని డిసైడ్ అయిపోయాడని టాక్. ప్రస్తుతం ధృవ సినిమాతో బిజీగా ఉన్నాడు చరణ్. ఆ తరవాత సుకుమార్ సినిమా పట్టాలెక్కబోతోంది. ఈలోగా కౌబోయ్ స్క్రిప్టు రెడీ అయితే… అది త్వరలోనే కొదమ సింహం లాంటి కథలో రామ్‌చరణ్‌ని చూడొచ్చు. ఆ సినిమా పట్టాలెక్కితే… దాదాపుగా టాలీవుడ్ మర్చిపోతున్న ఈ జోనర్‌కి మళ్లీ మంచి రోజులు వచ్చినట్టవుతుంది.