స్టార్ హీరో సినిమా వస్తోందంటే ఆ హంగామానే వేరు. రిలీజ్ కి ముందే ప్రీమియర్లు, ఫ్యాన్స్ షోల హడావుడి మొదలై పోతుంది. ఫ్యాన్స్ స్టామినా చూపించుకోవడానికి స్టార్లు కూడా ఇలాంటి స్పెషల్ షోలపై మక్కువ చూపిస్తుంటారు. దాదాపుగా అగ్ర హీరోల చిత్రాలన్నింటికీ ప్రీమియర్లు, ఫ్యాన్స్ షోలు తప్పనిసరి అయిపోయాయి. రామ్‌చరణ్ కొత్త సినిమా ధృవకీ ఫ్యాన్స్ షోలు ఉంటాయనుకొన్నారు ఫ్యాన్స్. అయితే వాళ్లందరికీ చరణ్ షాక్ ఇచ్చాడు. ధృవ సినిమా సంబంధించినంత వరకూ ఫ్యాన్స్ షోలు లేవట. నేరుగా ఉదయం ఆటే చూడాలట. ఫ్యాన్స్ షోలు వద్దన్నది రామ్ చరణ్ తీసుకొన్న తాజా నిర్ణయమని తెలుస్తోంది. బ్రూస్లీ సినిమా విడుదలకు ముందు రోజు స్పెషల్ షో వేశారు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యేసరికి బ్యాడ్ టాక్ విపరీతంగా స్పైడ్ అయ్యింది. ఆ ప్రభావం ఉదయం ఆటలపై చూపించింది. దాంతో వసూళ్లు బాగా తగ్గాయి. ఈసారి అలాంటి పొరపాటు చేయకూడదని చరణ్ భావిస్తున్నాడట. అర్థరాత్రి షోలు వేయొద్దని, ఫ్యాన్స్ కోసం ఉదయం ఆరింటి షోలు ఏర్పాటు చేయమని చరణ్ సూచించాడట.
ఈమధ్యే ఎన్టీఆర్ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకొన్నాడు. ‘జనతా గ్యారేజ్’ అర్థ రాత్రి షోల తరవాత.. నెగిటీవ్ టాక్ స్పైడ్ అయ్యింది. సినిమా బాగున్నా… డివైడ్ టాక్ వచ్చింది. ఆ ఎఫెక్ట్‌తో కొన్ని రివ్యూలు నెగిటీవ్‌గా వచ్చాయి. ఇక మీదట ఫ్యాన్స్ షోలు వేయకూడదని ఎన్టీఆర్ గట్టిగా డిసైడ్ అయ్యాడు. ఇప్పుడు చరణ్ కూడా అదే బాటలో నడుస్తున్నాడన్నమాట. సో.. ధృవ సినిమా చూడాలంటే మెగా ఫ్యాన్స్ కూడా అందరిలానే డిసెంబరు 9 వరకూ ఆగాలన్నమాట.