ఇప్పుడు అందరి కళ్లూ ఏప్రిల్ 30పైనే ఉన్నాయి. ‘పెద్ది’ కోసం ఫిక్స్ చేసిన డేట్ ఇది. అనుకొన్న సమయానికి సినిమా వస్తుందా, లేదా? అని మెగా అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. పెద్ది ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ 30న వచ్చే అవకాశం లేదని ట్రేడ్ అంచనా వేస్తోంది. మరోవైపు ఎస్.కె.ఎన్ ఓ సందర్భంలో ‘పెద్ది వాయిదా పడింది’ అంటూ తొందరపడి ఓ ప్రకటన చేశారు. ఆ తరవాత ‘సారీ’ చెప్పారనుకోండి. అది వేరే విషయం. దాంతో ‘పెద్ది’ పై కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. అయితే ‘రాకాస’ ప్రమోషన్లలో ‘పెద్ది వాయిదా పడడం లేదు’ అని చరణ్ ఓ సంకేతాన్ని పంపారు. అప్పటి నుంచీ ఏప్రిల్ 30పై ఓ భరోసా ఏర్పడింది.
పెద్ది రిలీజ్ డేట్ విషయంలో చరణ్ చాలా పట్టుదలతో ఉన్నారని, ఏప్రిల్ 30న ఈ సినిమా రిలీజ్ చేయాలన్న సంకేతాలు ఆయన టీమ్ కి పంపారని తెలుస్తోంది. అందుకే చరణ్ కూడా రాత్రీ పగలూ అనే తేడా లేకుండా ఈ సినిమా కోసం కష్టపడుతున్నారు. కంటికి గాయమైనా సరే, ఆయన ఒక్క రోజు విశ్రాంతి తీసుకొని సెట్ కి వెళ్లిపోయారు. ఇదంతా ఏప్రిల్ 30న ఈ సినిమాని తీసుకురావాలన్న ఉద్దేశంతోనే. చరణ్ పట్టుదల చూశాక, చిత్రబృందంలోనూ కసి పెరిగింది. వాళ్లు కూడా ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ‘పెద్ది’ రీ రికార్డింగ్ పనులు ప్రస్తుతం చెన్నైలో జరుగుతున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు అక్కడే ఉన్నారు. ‘పెద్ది’ రిలీజ్ డేట్ ప్రస్తుతం రెహమాన్ చేతుల్లో ఉంది. ఆయన రీ రికార్డింగ్ ఎంత త్వరగా పూర్తి చేస్తే – అంత త్వరగా ఈ సినిమా రెడీ అవుతుంది. మరి రెహమాన్ ఏం చేస్తారో??
