రామ్ చరణ్ సినిమా `పెద్ది` విడుదల మరోసారి డైలామాలో పడింది. ఏప్రిల్ 30న ఈ సినిమా రావాలి. అందుకోసం చిత్రబృందం రాత్రీ పగలూ తేడా లేకుండా కష్టపడుతోంది. సెకండ్ యూనిట్ కూడా రంగంలోకి దిగి.. షూటింగ్ చక క పూర్తి చేసే పనిలో పడింది. ఏకధాటిగా షూట్ చేసినా ఏప్రిల్ 15 వరకూ పని చేయాలి. అయినా సరే.. ‘పెద్ది’ టీమ్ తగ్గడం లేదు.
కానీ ఈలోగా టీమ్ కి గట్టి షాక్ తగిలింది. రామ్ చరణ్ కు సెట్లో గాయం అయ్యిందని, ఆయన కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. రామ్ చరణ్ టీమ్ గానీ, `పెద్ది` బృందం గానీ దీనిపై అధికారికంగా స్పందించలేదు. ఒకవేళ అదే నిజమే అయితే… ఈ సినిమా ఏప్రిల్ 30న రావడం దాదాపుగా అసాధ్యం. చరణ్ విశ్రాంతి తీసుకొంటే, ఆయన మళ్లీ సెట్లోకి ఎప్పుడు అడుగు పెడతారో చెప్పలేని పరిస్థితి. ఒక్క రోజు చేజారినా.. రిలీజ్ డేట్ ని అందుకోవడం అసాధ్యం అవుతుంది. సో సినిమాని వాయిదా వేయడం మినహా ‘పెద్ది’ టీమ్ దగ్గర మరో మార్గం లేదు. ప్రత్యామ్నాయ మార్గాలేమైనా అన్వేషిస్తే తప్ప.. ఏప్రిల్ 30న ‘పెద్ది’ విడుదల కాదు. మరి.. చిత్రబృందం ఏం ఆలోచిస్తుందో..?
మార్చి 27న చరణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఓ టీజర్ విడుదల చేయడానికి చిత్రబృందం ప్రయత్నిస్తోంది. యాక్షన్ నేపథ్యంలో టీజర్ కట్ చేశారని, ఇది ఫ్యాన్స్ కి నచ్చుతుందని తెలుస్తోంది. ఆ టీజర్ తో అయినా.. చరణ్ ఫ్యాన్స్ సంతృప్తి పడతారేమో చూడాలి. ఇప్పటికే విడుదలైన రెండు పాటలూ సూపర్ డూపర్ హిట్ అయిపోయాయి. ఇక టీజర్ ఎలా ఉంటుందో…?


