రామ్ మాధవ్ .. ఈ రేపు ఒకప్పుడు దేశ రాజకీయాల్లో కీలకం. తెలుగు వాడైన ఆయన ఆరెస్సెస్ ద్వారా బీజేపీలో ఉన్నత స్థానానికి వెళ్లారు. అమిత్ షా తర్వాత అధ్యక్ష పదవి ఆయనకేననిప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆయన బెంగళూరు మున్సిపల్ ఎన్నికలకు ఇంచార్జ్ గా నియమితులయ్యారు. ఇలా నియమితులు కావడాన్ని కూడా ఆయనకు ప్రాధాన్యం అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
వైఫల్యాలతో తిరిగి ఆరెస్సెస్‌కు వెళ్లిన రామ్ మాధవ్
2014 తర్వాత బీజేపీలో మోదీ-షా ద్వయానికి అత్యంత సన్నిహితుడిగా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా రామ్ మాధవ్ చక్రం తిప్పారు. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగురవేయడంలో, జమ్మూ కాశ్మీర్లో పీడీపీతో అనూహ్య పొత్తు కుదర్చడంలో ఆయన పోషించిన పాత్ర అప్పట్లో సెన్సేషన్. ఇంగ్లీష్‌పై పట్టు, అంతర్జాతీయ వేదికలపై పార్టీ వాణిని వినిపించే నైపుణ్యం చూసి.. భవిష్యత్తులో ఆయన బీజేపీ అధ్యక్ష పదవిని కూడా చేపడతారని రాజకీయ వర్గాలు భావించాయి. అయితే, జమ్మూ కాశ్మీర్ పొత్తు విఫలం కావడం, పార్టీ అంతర్గత సమీకరణాల్లో మార్పుల వల్ల 2020లో ఆయన పదవిని కోల్పోయి తిరిగి మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ కు వెళ్లాల్సి వచ్చింది.
తిరిగి బీజేపీలోకి.. ఇప్పుడు మున్సిపల్ బాధ్యతలు
దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత, 2024 జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రామ్ మాధవ్‌ను పార్టీ మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి తీసుకువచ్చింది. గతంలో అక్కడ ఆయనకున్న అనుభవం దృష్ట్యా ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు అప్పగించింది. ఆ తర్వాత పార్టీలో ఆయన స్థానం మళ్లీ సుస్థిరమవుతుందని భావించారు. కానీ తర్వాత పెద్దగా పార్టీలో బాధ్యతల్లేవు. కొత్తగా ఎన్నికైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, రామ్ మాధవ్‌కు గ్రేటర్ బెంగళూరు అథారిటీ ఎన్నికల బాధ్యతలను అప్పగించారు.
స్థానిక ఎన్నికలతో సత్తా చాటాల్సిన సమయం
జాతీయ స్థాయిలో కీలక నిర్ణయాలు తీసుకునే స్థాయి నుండి, ఇప్పుడు ఒక నగరం కార్పొరేషన్ ఎన్నికల బాధ్యతలను తీసుకోవాల్సి వచ్చింది. అయితే దీన్ని చిన్నతనంగా చూడలేరు. ఈ ఎన్నికలు ఆయనకు ఒక సవాలు . బెంగళూరు వంటి మెట్రో నగరంలో 90 లక్షలకు పైగా ఓటర్లు, 369 వార్డులు ఉండటంతో.. ఈ ఎన్నికలను రామ్ మాధవ్ ఒక అసెంబ్లీ యుద్ధంగా తీసుకుని గెలిపించాల్సి ఉంది. బెంగళూరు మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధిస్తే, రామ్ మాధవ్ మళ్లీ జాతీయ స్థాయిలో చక్రం తిప్పే అవకాశం ఉంటుంది. లేదంటే ఆయన రాజకీయ ప్రస్థానం మరింత క్లిష్టతరంగా మారవచ్చు.
