రామ్ హీరోగా ఓ సినిమా రూపుదిద్దుకొంటోంది. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. ఈనెల 15న టైటిల్ ప్రకటిస్తారు. ఈ సందర్భంగా ఓ గ్లింప్స్ కూడా విడుదల చేస్తారు. ఈ సినిమాకు ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇప్పుడు ఇదే టైటిల్ ఖరారు చేయబోతున్నారని టాక్. కాకపోతే ఈ సినిమాలో ఆంధ్రా కింగ్ రామ్ కాదు. ఉపేంద్ర.
ఓ స్టార్ హీరో అభిమానిగా రామ్ నటించిన సినిమా ఇది. ఆ స్టార్ హీరో ఉపేంద్ర అన్నమాట. ‘నేను ఫలానా హీరో తాలుకా’ అని చెప్పడానికి హీరో ఈ మాట ఉపయోగిస్తుంటాడు. అదీ మేటరు. పవన్ కల్యాణ్ అభిమానులు ‘పిఠాపురం ఎం.ఎల్.ఏ తాలుకా’ అనే మాటని బాగా వైరల్ చేశారు. కాబట్టి ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ అనేది త్వరగా జనంలోకి చేరిపోవడం గ్యారెంటీ.
ఈ సినిమా కథ గురించి కానీ, హీరో పాత్ర గురించి కానీ ప్రస్తుతానికి చిత్రబృందం ఎలాంటి క్లూ ఇవ్వలేదు. కాకపోతే… ఇదో పిరియాడిక్ డ్రామా అని తెలుస్తోంది. ఓ మారుమూల ప్రాంతం కరెంటుకు నోచుకోలేదట. ఆ ప్రాంతానికి కరెంట్ తీసుకురావడానికి హీరో ఏం చేశాడన్నది కథ అని సమాచారం. మాస్, యాక్షన్, హీరోయిజం, వీటి మధ్యలో ఓ లవ్ స్టోరీతో పాటు మంచి మెసేజ్ కూడా ఈ సినిమాతో ఇవ్వబోతున్నారని ఇన్ సైడ్ వర్గాల టాక్. ఉపేంద్ర పాత్ర చాలా వెరైటీగా ఉండబోతోందని సమాచారం. ముందు ఈ పాత్ర కోసం చాలా మంది హీరోల పేర్లు పరిశీలించారు. ఓ దశలో బాలకృష్ణని తీసుకొద్దాం అనుకొన్నారు. మోహన్ లాల్ పేరు కూడా గట్టిగా వినిపించింది. చివరకు ఉపేంద్రతో సర్దుకున్నారు.