సినిమాలో సినిమా చాలాసార్లు చూసేశాం. వెండి తెరపై స్టార్ల కథలూ విన్నాం. ఇప్పుడు ఓ అభిమాని కథని చూపించబోతున్నారు. ‘ఆంధ్రా కింగ్ తాలుకా’లో. రామ్ కథానాయకుడిగా నటించిన సినిమా ఇది. ఉపేంద్ర కీలక పాత్రధారి. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. మహేష్ దర్శకత్వం వహించారు. ఈనెల 27న విడుదల అవుతోంది. ఈరోజు కర్నూలు వేదికగా ట్రైలర్ ఆవిష్కరించారు.
సూర్య అనే స్టార్కీ, సాగర్ అనే అభిమానికీ మధ్య నడిచే కథ ఇది. ఆ ఎమోషన్ ప్రతిబింబించేలా ట్రైలర్లో కొన్ని డైలాగులు వినిపించాయి.
”ఏంటి సాగర్.. ప్రింట్ రాకపోతే అద్దాలు పగలగొడతావ్… కాలేజీలో గొడవలు పడతావ్… టికెట్లు లేకపోతే పరువు పోద్ది అంటావ్.. అసలు పరిచయమే లేని వ్యక్తి కోసం ఇదంతా ఏమిటి? పిచ్చి కాకపోతే…”
”తలెత్తుకొని చూసే వ్యక్తి ఉన్నప్పుడు కళ్లు నెత్తి మీదే ఉంటాయి”
”ఆంధ్రాకింగ్ ఫ్యాన్ అని ఎగతాళి చేశాడ్రా.. ఆడికి మనమేంటో చూపించాలి”
”జీవితం అంటే సినిమా కాదు.. బయటకు రా”
”స్టార్ అనేవాడు అద్దాల మేడల్లో ఉండాలి. అంతే కానీ రోడ్డు మీదకు వస్తే పల్లకి మోస్తున్న అభిమానులు కూడా దించేస్తారు..”
”వాడున్నాడని నాకు తెలియకపోవొచ్చు. కానీ నేనంటూ ఒకడ్ని ఉన్నానంటే అది వాడి వల్లే..”
– ఇలాంటి డైలాగులు ఈ ట్రైలర్లో కనిపించాయి.. వినిపించాయి. వీటిని డీ కోడ్ చేస్తే.. ఈ సినిమా కథేమిటో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. రామ్ ఇంకాస్త యంగ్ లుక్లో కనిపిస్తున్నాడు. తన వింటేజ్ లుక్ బాగుంది. ఉపేంద్ర పాత్ర కూడా బలంగా తీర్చిదిద్దినట్టు అర్థం అవుతోంది. ట్రైలర్లో చాలా రకాలైన ఎమోషన్స్ ఉన్నాయి. వాటన్నింటినీ కొత్త దర్శకుడు బాగా తీర్చిదిద్దాడనిపిస్తోంది. మైత్రీ మూవీస్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 28న రావాల్సిన సినిమా ఇది. ఒకరోజు ముందే విడుదల చేస్తున్నారు. 26న ప్రీమియర్ల హడావుడి కూడా మొదలైపోతుంది. ఈలోగా ట్రైలర్ తో ప్రమోషన్ల పరంపరకు శ్రీకారం చుట్టారు.