ఈ సంక్రాంతికి సందడి చేయబోతున్న సినిమాల్లో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ఒకటి. రేపు (ఆదివారం) ట్రైలర్ రాబోతోంది. ఇప్పటికి ఈ సినిమా నుంచి మూడు పాటలొచ్చాయి. ‘మీసాల పిల్ల’ చాట్ బస్టర్ అయ్యింది. రెండో పాట ఓకే అనిపించుకొంది. చిరు – వెంకీ కలసి స్టెప్పులేసిన పాట అభిమానుల్ని అలరిస్తోంది. ఈ సినిమా కోసం రమణ గోగుల ఓ పాట పాడారని, అది ఈ ఆల్బమ్ కే హైలెట్ గా నిలవబోతోందని ముందు నుంచీ ప్రచారం జరుగుతూ వచ్చింది. కానీ ఇంత వరకూ రమణ గోగుల పాట బయటకు రాలేదు.
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో ‘గోదారి గట్టుమీద’ పాట ఎంత హిట్టయ్యిందో తెలిసిందే. ఆ సినిమానే ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించింది. రమణ గోగుల గట్టి కమ్ బ్యాక్ ఇచ్చిన పాట అది. ఆ సెంటిమెంట్ తో రమణ గోగులతో మరో పాట పాడించాలని ముందే ఫిక్సయ్యింది టీమ్. భీమ్స్ కూడా అనువైన ట్యూన్ కంపోజ్ చేశాడు. భాస్కరభట్లతో రిలిక్స్ రాయించారు. రమణ గోగుల పాట పాడేశారు. ఈ ఆల్బమ్ లో ముందుగా రికార్డ్ చేసిన పాట ఇదే. కానీ పాట బయటకు వచ్చిన తరవాత లెక్కలు మారిపోయాయని తెలుస్తోంది. పాటకు సరైన ప్లేస్ మెంట్ దొరక్కపోవడం, లీడ్ సీన్లలో మార్పు వల్ల… పాట ఇరికించే అవకాశం లేకుండా పోయిందని తెలుస్తోంది. దాంతో రికార్డ్ చేసిన పాటే పక్కన పెట్టేశారని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి ఆ పాట బయటకు వస్తే సంక్రాంతి ఊపు మరోలా ఉండేదని టాక్. చేతిలో మంచి పాట ఉన్నా, విడుదల చేయలేకపోయారు. కనీసం ఎండ్ టైటిల్స్ లో అయినా ఈ పాటని వినిపిస్తే, ఫ్యాన్స్ ఖుషీ అవుతారు. అనిల్ రావిపూడి అలాంటి ప్రయత్నం ఏమైనా చేస్తే బాగుంటుంది.
