మోడీ భారతదేశం కోసం పైనుంచి దిగివచ్చిన దేవదూత.. ఆయన సాక్ష్యాత్తు దైవాంశ సంభూతుడు.. అందరు రాజకీయ నాయకుల్లా మోడీని చూడకండి.. ఇవన్నీ బీజేపీ నేతలు మోడీపై తమకున్న అభిమానాన్ని చాటుకోవడానికి చెప్పిన మాటలు. కాస్త అతిగా ఉన్నా “పొగడ్త” విషయంలో తగ్గేది లేదు కాబట్టి వాడేశారు. అయితే ఇప్పటికే మోడీపై హిందుత్వ ముద్ర పడిపోయింది! ప్రధాని కాకముందు సంగతి వేరు, ఒక్కసారి దేశప్రజలందరికీ ప్రధాని అయిన తర్వాత పరిస్థితి వేరు. యావత్ భారతదేశం గర్వించే ప్రధానమంత్రి, ప్రపంచ దేశాల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నేత ఇలా ఒక మతానికి.. (అది గొప్పదా కాదా అనే సంగతి ఇప్పుడు అప్రస్తుతం) బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారన్న విమర్శ మోడీని అభిమానించే ఇతర మతస్థులకు, ముఖ్యంగా లౌకిక వాదులకు కాస్త ఇబ్బంది కలిగించే విషయంగా తయారయ్యింది.
అప్పుడెప్పుడో రగిలిన అయోధ్య రామాలయం ఇష్యూ నుంచి బయటకు రావటానికి బీజేపీకి ఎంతకాలం పట్టింది అనే విషయం మిగిలిన అందరికంటే బీజేపీకే బాగా తెలుసు. ఎన్నికల సమయంలో బీజేపీకి ప్రధాన అస్త్రంగా రామజన్మభూమికి ముఖ్యంగా ఎన్నికల్లో ప్రత్యేక స్థానం ఉంది. అయితే 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే ఎన్నికల ప్రణాళికలో రామజన్మభూమి అంశానికి ఎంత ప్రధాన్యత ఇవ్వాలో అంతే ఇచ్చింది. దాంతో మోడీపై ఆ విమర్శలు తగ్గాయనే చెప్పాలి. అయితే తాజాగా వీటికి సంబందించిన విషయాలపై ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది మోడీ సర్కారు. కీలకమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ హిందుత్వ మార్క్ ను బయటకు తీసేందుకు సిద్ధమైంది. దీంతో విమర్శల వర్షాలు కురవడం మొదలైపోయాయి.
రామజన్మభూమి వివాదానికి కేంద్రమైన అయోధ్యలో రామాయణ మ్యూజియంను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. హిందువుల ఓట్లకు గాలం వేసేందుకే బీజేపీ ప్రభుత్వం ఎన్నికల వేళ ఇలాంటి నిర్ణయం తీసుకుందని మరోవైపు విపక్షాలు మండిపడుతున్నాయి. వివాదాస్పద రామజన్మభూమి ఆలయం, బాబ్రీ మసీదుకు సుమారు 15 కిలోమీటర్ల దూరంలో 25 ఎకరాల స్థలంలో ఈ మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు. ఈ స్థలాన్ని పరిశీలించేందుకు, అనంతరం రామాయణ సర్క్యుట్ అడ్వయిజరీ బోర్డుతో భేటీ కావడానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మహేశ్ శర్మ నేడు అయోధ్య వెళుతున్నారు. ఈ విషయాలపై స్పందించిన శర్మ… ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు సందర్శించి, రాముడి జీవితం గురించి, రామాయణం గురించి తెలుసుకొనేవిధంగా ఈ మ్యూజియం ఏర్పాటుచేస్తామని అంటున్నారు.
ఈ విషయాలపై తాజాగా యూపీ కాంగ్రెస్ సీఎం అభ్యర్ధి షీలా దీక్షిత్ స్పందించారు. ప్రతి ఒక్కరూ రాముడ్ని ఆరాధిస్తారు. కానీ, ఎన్నికలకు కొన్ని నెలలే ముందే ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు. ఇందులో మతపరమైన కోణం కనిపిస్తోంది. అయోధ్య వేదికగా ఇలాంటి చర్యలు చేపట్టడం యూపీపై ప్రభావం చూపుతుంది అని విమర్శించారు. ఇదే సమయంలో మతాన్ని రాజకీయాలతో ముడిపెట్టి రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకోవడం గర్హనీయమని బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా కేంద్రం తీరును తప్పుబట్టారు.
దీంతో ఎంత కాదనుకున్నా, ఒకప్పుడు తన ఎన్నికల ప్రణాళికలో మొదటి మూడు అంశాల్లో ఒకటిగా ఉండాల్సిన రామజన్మభూమి ఇష్యూను.. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే ఎన్నికల ప్రణాళికలో ఎక్కడో ఆఖరున ప్రస్తావించినా, ఎన్నికలు అయ్యి కుర్చీలెక్కి రెండేళ్లు గడిచిన తర్వాత ఇప్పుడు ఉన్నట్లుండి మోడీ సర్కారు ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోవడం ఎన్నికల వేళ ఎన్డీయే చేస్తోన్న జిమ్మిక్కులు కాకమరేమిటి? అయినా మోడీ పాలనపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయని బీజేపీ నేతలు చెబుతున్న వేళ… ఇలాంటి పనులేందుకు చేయాలి? మోడీ పేరు మీద, ప్రస్తుతం దేశపాలనమీద ఎన్నికల్లో దుమ్మురేపాల్సిన బీజేపీ.. మోడీ లాంటి నాయకుడు ఉన్నప్పుడు కూడా ఇలాంటి విషయాలపై తొందరపడటం అవసరమా? ఇది మోడీ క్రెడిబిలిటీని, మోడీ స్థాయిని తగ్గించడం కాదా?” ఏమో… మోడీకి, బీజేపీ నేతలకే తెలియాలి అని పలువురు అభిప్రాయపడుతున్నారు!