భారతీయ సినిమా ఎల్లలు దాటేసింది. ప్రపంచం మొత్తం చుట్టేస్తోంది. దాంతో పాటు బడ్జెట్ల బౌండరీల గేట్లు కూడా కూలద్రోసి ముందుకు వెళ్లిపోతోంది. ఇది వరకు వంద కోట్ల సినిమా అంటే ‘వామ్మో’ అనుకొనేవారంతా. ఇప్పుడు ఆ వంద వెయ్యి అయ్యింది. బాలీవుడ్ లో ఓ సినిమా ఏకంగా రూ.4 వేల కోట్లతో తెరకెక్కిస్తున్నారు. అదీ ఇండియన్ సినిమా సాధించిన ఘనత.
బాలీవుడ్ లో రూపొందుతున్న ‘రామాయణ’ కోసం నాలుగువేల కోట్ల బడ్జెట్ అవుతోందని నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించారు. ఆయన స్టేట్మెంట్ తో ఒక్కసారిగా భారతీయ చలన చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. ఇది కనీ వినీ ఎవరుగని అంకెలు.. ఇది వరకు చూడలేని, భవిష్యత్తులో చూస్తామో లేదో తెలియని బడ్జెట్.
‘రామాయణ’ ముందు నుంచీ హాట్ టాపిక్కే. ఈ సినిమా బడ్జెట్ దాదాపుగా 2 వేల 500 కోట్లని అప్పట్లో వార్తలొచ్చాయి. ఆ అంకెలకే చాలామంది ఆశ్చర్యపోయారు. ఇప్పుడు బడ్జెట్ 4 వేల కోట్లు అనేసరికి మరింత షాక్ కి గురవుతున్నారు. భారతీయ సినిమా స్టామినా 2 వేల కోట్లు. అంటే దానికి రెట్టింపు పెట్టుబడి పెడుతున్నారన్నమాట. కాకపోతే.. రామాయణ రెండు భాగాలుగా తీస్తున్నారు. ఒక్కో పార్ట్ కీ 2 వేల కోట్లు అనుకోవొచ్చు.
రామాయణం లాంటి ఇతిహాస గాథలకు ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించే సత్తా ఉందని, ఈ సినిమా భాషలకు అతీతంగా ప్రపంచమంతా చూస్తారని దర్శక నిర్మాతలు గట్టిగా నమ్ముతున్నారు. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న సినిమా ఇది. యష్ రావణాసురిడిగా కనిపించబోతున్నారు. సన్నీడియోల్, లారా దత్తా, రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. వీళ్లు కాకుండా కొంతమంది ప్రముఖ హీరోలు అతిథి పాత్రల్లో దర్శనమిస్తారని తెలుస్తోంది. ఎంతైనా 4 వేల కోట్ల బడ్జెట్ ఇది.. దాదాపుగా హాలీవుడ్ ని టచ్ చేశాం. ఈ రిస్క్ గనుక తగిన ప్రతిఫలం అందిస్తే, హాలీవుడ్ కూడా విస్తుపోయే బడ్జెట్లతో భారతీయ సినిమా ముందుకు దూసుకుపోవడం ఖాయం.