కొన్ని కాంబినేషన్లు ఎన్నిసార్లు చూసినా చూడబుద్దేస్తుంటుంది.. వినబుద్దేస్తుంటుంది. అలాంటి కాంబోనే సుకుమార్ – దేవిశ్రీ ప్రసాద్. ఆర్య నుంచీ వీళ్లిద్దరి బంధం కొనసాగుతోంది. సుక్కు ఏ సినిమా చేసినా, దానికి మ్యూజిక్కు మాత్రం డీఎస్పీనే. దానికి తగ్గట్టుగానే సుకుమార్ సినిమాలకు అదిరిపోయే పాటలిచ్చేస్తుంటాడు. సినిమా ఎలాగున్నా.. ఆ పాటలు మాత్రం సూపర్ హిట్టయిపోతుంటాయి. మరీ ముఖ్యంగా వీరి కాంబోలో వచ్చే ఐటెమ్ సాంగ్ ప్రతీసారీ ఓ ట్రెండ్ క్రియేట్ చేస్తుంటుంది. ప్రస్తుతం రామ్ చరణ్ – సుకుమార్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. దీనికీ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. డిసెంబరులో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. ఈలోగా దేవీ పాటలు ఇచ్చే పనిలో పడ్డాడు. ప్రస్తుతం సుకుమార్, డీఎస్పీ దుబాయ్ చెక్కేశారు. అక్కడ చరణ్ సినిమాకి సంబంధించి ట్యూన్లు సిద్దం చేస్తున్నార్ట. వారం రోజుల్లో మళ్లీ వీరిద్దరూ తిరిగొచ్చి రికార్డింగ్ ప్రారంభిస్తారు.
అన్నట్టు ఈ సినిమా టెక్నీషియన్ల విషయంలో చరణ్ చాలా జాగ్రత్తలే తీసుకొంటున్నాడు. దేవిశ్రీ ప్రసాద్‌ని తప్ప… మిగిలిన ప్రధాన టెక్నీషియన్ల ఎంపిక ఛాయిస్ తనదే. ఖైదీ నెం.150కి పనిచేస్తున్న కెమెరామెన్ రత్నవేలు, ఆర్ట్ డైరెక్టర్ తోట తరణిలను పట్టుబట్టి ఈ సినిమా కోసం తీసుకొచ్చాడు చరణ్. సుకుమార్, రత్నవేలు, డీఎస్పీ, తోటతరణి.. ఈ కాంబోలో ‘వన్ నేనొక్కడినే’ సినిమా వచ్చింది. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా.. లుక్ కొత్తగా ఉంటుంది. అలాంటి లుక్‌లోనే తన సినిమా ఉండాలని చరణ్ భావిస్తున్నాడట. అందుకే ఏరి కోరి ఈ కాంబో సెట్ చేశాడని చెబుతున్నారు.