నరేంద్ర మోడీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడంతో వివాహాలు జరుగుతున్న ఇళ్లల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ యోగ గురు బాబా రామ్ దేవ్ ఆసక్తి కరమైన వాఖ్య చేశారు. ఈ ఇబ్బందులను గ్రహించే ఆర్ధిక మంత్రి వివాహాలు చేసుకొంటున్న కుటుంబాల వారు బ్యాంక్ లనుండి తీసుకొనే డబ్బును రు 2.5 లక్షలకు పెంచినా సమస్యలు తీరడం లేదు.
మరో 15 రోజులో, నెల రోజులో ఆగి, పెళ్లిళ్ల సీజన్లో ముగిసిన తరువాత నోట్లను రద్దు చేసి ఉంటె ఇటువంటి ఇబ్బంది ఏర్పడి ఉండెడిది కాదని యోగ గురు పేర్కొన్నారు. “బిజెపి లో చాలామంది బ్రహ్మచారులు ఉన్నారు. అందుకనే వారికి పెళ్లిల సీజన్లో గురించి ఆలోచన రాలేదు. దానితో ఈ పొరపాటు జరిగి పోయింది” అంటూ ఆయన చురక అంటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహితం బ్రహ్మచారి కావడం గమనార్హం.
నోట్లరద్దుపై ఎన్డీటివి లో ప్రముఖ జర్నలిస్ట్ శేఖర్ గుప్తాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో అయన ఈ చురక అంటించారు. మరి కొన్ని రోజుల తరువాత ఈ నోట్ల రద్దును చేపట్టి ఉంటె వివాహాలు జరపాలి అనుకున్న వారికి, సీజనల్ వ్యాపారాలు చేసుకొనే వారికి ఇబ్బంది తప్పి ఉండెడిది అన్నారు. అయితే నోట్ల రద్దువల్లన జరిగే మరో మంచి పరిణామం వరకట్నం ఇవ్వమని ఇప్పుడు ఎవ్వరూ కోరరు అని ఆయన చెప్పారు.