దక్షిణాది నుంచి ఎన్డీఏ కూటమికి పడాల్సిన ఓట్ల బాధ్యతను బీజేపీ అగ్రనాయకత్వం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు అప్పగించింది. మొత్తం ముగ్గురు కేంద్ర మంత్రుల్ని ఓటింగ్ ఏజెంట్లుగా నియమించింది. వారిలో రామ్మోహన్ నాయుడు ఒకరు. దక్షిణాది వైపు నుంచి ఎన్డీఏ కూటమి ఓటర్లందర్నీ ఆయన సమన్వయం చేస్తారు. ఓ రకంగా తాము ఎన్డీఏ అభ్యర్థికే ఓటేశామని ఏజెంట్ కు నమ్మకం కలిగేలా చేయాల్సి ఉంటుంది. మిగిలిన వారందరి సంగతేమో కానీ.. వైసీపీ ఎంపీలు కూడా.. రామ్మోహన్ కిందకే వస్తారు.
వైసీపీకి చెందిన రాజ్యసభ, లోక్ సభ సభ్యులు ఎన్డీఏ కూటమి అభ్యర్థికే ఓటు వేయనున్నారు. అయితే డబుల్ గేమ్ ఆడకుండా బీజేపీ పెద్దలు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రామ్మోహన్ నాయుడు మద్దతుగా ఓటేస్తామని చెప్పిన వైసీపీ సభ్యులపైనా ఓ కన్నేయనున్నారు. ఎవరికి ఓటేశారో తర్వాత బీజేపీ నాయకత్వానికి నివేదిక కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఓట్లు తేడా పడితే.. ప్రధానంగా వైసీపీ ఎంపీలపైనే అనుమానం వస్తుంది. చెల్లని ఓటు వేసినా సమస్యలే వస్తాయి. అందుకే వైసీపీ నేతలకు అదనపు పరీక్ష రామ్మోహన్ నాయుడు ముందు నిరూపించుకోవాల్సి రావడం.
ఓ వైపు ఓడించిన ఎన్డీఏకు మద్దతు ఎందుకు ఇస్తున్నారని.. కనీసం బీఆర్ఎస్ లాగా.. ఓటింగ్ కు దూరంగా అయిన ఉండవచ్చు కదా అని.. పార్టీ సానుభూతిపరులు గింజుకుంటున్నారు. ఉండవల్లి లాంటి వాళ్లు నెత్తినోరు బాదుకుని అలాంటి పనులు చేయవద్దని అంటున్నారు. కానీ ఎంతకు దిగజారి అయిపోయినా సరే.. తాము అలాంటివేమీ పెట్టుకోము కాబట్టి మద్దతుగా ఓటేసి తీరుతామని ఢిల్లీ చేరుకున్నారు. కాషాయ డ్రెస్ కోడ్ ను సుబ్బారెడ్డి మెయిన్ టెయిన్ చేస్తున్నారు. అయన అవస్థలు చూసి ఢిల్లీలో చాలా మంది రాజకీయాలు ఎలా చేయకూడదో వైసీపీని చూసి నేర్చుకోవాలని సెటైర్లు వేసుకుంటున్నారు.