ఇక్కడ `రానా’నే బాహుబలి !

బాహుబలిలో రానా విలన్ పాత్ర (భల్లాల దేవ) పోషించి ఉండవచ్చు. కానీ, చెన్నై వరద బాధితులను ఆదుకోవడం కోసం పెద్దఎత్తున నిత్యావసర వస్తుసముదాయాన్ని సేకరించడంలో మాత్రం రానా దగ్గుబాటి హీరో అనిపించుకుంటున్నాడు. నిత్యావసర వస్తువులను లారీలోకి లోడ్ చేయగానే రామానాయుడు స్టూడియోస్ లో ఆనందం వెల్లివిరిసింది. దీంతో `సూత్రధారి `రానా’నే నిజమైన బాహుబలి’ అన్న ప్రంశంసలు అందుకున్నాడు.

`మన మద్రాసు కోసం’ అంటూ సోషల్ మీడియాలో ప్రారంభించిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన లభించింది. రానా అతని తోటి యువ నటీనటులు చురుగ్గా ప్రచారం చేశారు. పెద్ద మొత్తంలో సేకరించిన నిత్యావసర వస్తువుల ప్యాకెట్లు, దుప్పట్లు, దుస్తులు, సాధారణ మందులు అన్నింటినీ కలిపి లారీలకెక్కించారు. లోడ్ తో నిండిపోయిన లారీలు గురువారం రాత్రి చెన్నైకి బయలుదేరాయి. కాగా, రానా దగ్గుబాటి కూడా రేపు (శుక్రవారం) చెన్నైకి చేరుకుని అక్కడి వరదబాధిత సహాయక బృందాలను కలుసుకుని ఈ నిత్యావసర వస్తువులు బాధితులకు అందేలా చూస్తారు.

తెలుగు సినీరంగం పుట్టిందే మద్రాసులో కావడంతో హైదరాబాద్ లోని తెలుగు సినీరంగ ప్రముఖులు సహజంగానే చెన్నై వరదల పట్ల చలించిపోయారు. ఎవరికి తోచిన సాయం వారు చేశారు. కేవలం డబ్బులు ఇవ్వడంతో సరిపెట్టుకోకుండా రానాలాంటి యువహీరోలు, హీరోయిన్లు ఒక బృందంగా ఏర్పడి సోషల్ నెట్ వర్క్ ద్వారా, టివీ మీడియా ద్వారా ముమ్మరంగా ప్రచారం చేశారు. బాధితుల కోసం నిత్యావసర వస్తువులను హైదరాబాద్ వాసుల నుంచి పెద్ద మొత్తంలోనే సేకరించగలిగారు. రానాతో పాటుగా నవదీప్, నాని, మంచు లక్ష్మి వంటి వాళ్లు `మన మద్రాసు కోసం’ కార్యక్రమం పట్ల జనంలో చైతన్యం కలిగించడంలో కలసి పనిచేశారు.

mana1

ఈ మొత్తం కార్యక్రమానికి ఫిల్మ్ నగర్ లోని రామానాయుడు స్టూడియోస్ వేదికగా మారింది. ముమ్మరంగా ప్రచారం చేయడంతో నిత్యావసర వస్తువులు కుప్పతెప్పలుగా వచ్చిపడ్డాయి. వాటిని ఒక ఆర్డర్ లో పెట్టడం కోసం రానా కుర్రకారుతో ఒక ప్రత్యేక బృందాన్ని తయారుచేశారు. వారంతా కష్టపడి నిత్యావసర వస్తువులు అందరికీ అందేలా ప్యాకెట్లు కట్టి వాటిని లారీల్లోకి ఎక్కించారు. చేయిచేయి కలిపితే సాధించలేనిది ఏదీలేదని యువత నిరూపించింది.

చెన్నై మహానగరం వరదల్లో చిక్కుకున్నదని తెలియగానే రానా సోషల్ మీడియాలో స్పందించారు. కేవలం డబ్బులు ఇవ్వడమే కాకుండా బాధితులకు తోడుగా, అండగా నిలవడమే సరైన మార్గమనుకున్నారు. అదే సమయంలో త్రిలోక్ అనే కుర్రాడు ఫేస్ బుక్ లో ఇలాంటి కార్యక్రమం ప్రారంభించాడు. దీంతో రానా ప్రేరణ పొంది తన సహ నటులు నాని, నవదీప్, మంచు లక్ష్మి తో ఆలోచన పంచుకున్నారు. ఇక క్షణం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగారు. వినూత్న ప్రచారకార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దీంతోపాటుగా, రామానాయుడు స్టూడియోస్ దగ్గర కలెక్షన్ పాయింట్లు తెరిచారు. ఏఏ వస్తువులు బాధితులకు అందించవచ్చన్న విషయంలో సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. మొత్తానికి వీరి ప్రచారం ఊరికేపోలేదు. పెద్ద ఎత్తున స్పందన లభించింది. ఫలితంగా లారీలకొద్దీ నిత్యావసర వస్తువుల చెన్నైకి వెళుతున్నాయి. అక్కడ కూడా బాధితులకు అందించడంలో రానా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఆ విధంగా రానా నిజమైన హీరో (బాహుబలి) అయ్యాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com