బాలీవుడ్లో ఫక్తు యాక్షన్ మసాలా సినిమాలకు పెట్టింది పేరు.. రోహిత్ శెట్టి. తను ఎంచుకునే కథలన్నీ రొటీన్‌గానే ఉంటాయి. కానీ.. దాన్ని తనదైన స్టైల్లో మలచి… బీభత్సాన్ని సృష్టించేస్తాడు. ఆ స్పీడు, జోరు చూస్తే.. ఎవరైనా సరే – ముక్కున వేలేసుకోవాల్సిందే. సింగం సిరీస్‌లో వచ్చిన సినిమాలన్నీ రోహిత్ శెట్టి స్టామినాకు అద్దం పడతాయి. ఇప్పుడు తన దృష్టి ‘టెంపర్’ సీక్వెల్ పై పడింది. ఎన్టీఆర్ – పూరి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా… టాలీవుడ్లో మంచి విజయాన్ని అందుకుంది. బాలీవుడ్లో రీమేక్ చేయడానికి కావల్సిన అన్ని అంశాలూ ఇందులో ఉన్నాయి. కాబట్టి సహజంగానే రీమేక్ క్యాటగిరీలో చేరిపోయింది.
రణ్వీర్ సింగ్‌ని కథానాయకుడిగా ఎంచుకుని ఈ సినిమాకి స్టార్ డమ్ తీసుకొచ్చాడు రోహిత్. ఇప్పుడు ట్రైలర్ వచ్చింది. సాధారణంగా… రీమేక్ కథ అనగానే.. వర్జినల్ సినిమాలోని షాట్స్‌ని యధాతధాంగా దింపేయడానికి ట్రై చేస్తుంటారు. కానీ… రోహిత్ శెట్టి మాత్రం – పూరి రాసుకున్న కథని తనదైన స్టైల్ లో ఆవిష్కరించడానికి ప్రయత్నించాడనిపిస్తుంది. సింగం సిరీస్ లానే.. ఇది కూడా.. హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా మారిపోయింది. అన్నింటికంటే ముఖ్యంగా `సింగం` సీక్వెల్లా కలరింగు ఇచ్చాడు దర్శకుడు. టెంపర్ అనే సినిమా ఒకటుందని, దాన్ని రోహిత్ రీమేక్ చేశాడని తెలియకపోతే… బాలీవుడ్ ప్రేక్షకులు దీన్ని సింగం కి సీక్వెల్‌గానే భావించే అవకాశాలున్నాయి. దానికి తోడు చివర్లో అజయ్ దేవగణ్ ని రంగంలోకి దింపి.. టోటల్లో సింగం లా మార్చేశాడు. కథలో పెద్దగా మార్పులేం లేవని ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. ఈ కథని తనదైన స్టైల్ లో మార్చుకోవడంలో రోహిత్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఈమధ్య బాలీవుడ్‌కి వెళ్లిన తెలుగు రీమేక్‌లు అంతగా సక్సెస్ అవ్వలేదు. పైగా తెలుగులో ఉన్న ఫీల్‌ని పాడుచేశారన్న అపఖ్యాతి మూటగట్టుకున్నారు అక్కడి దర్శకులు. మరి రోహిత్ ఏం చేశాడో తెలియాలంటే ఈనెల 27 వరకూ ఆగాల్సిందే.