జనసేన ఎమ్మెల్యే..అనధికారిక వైసీపీ నేత రాపాక వరప్రసాద్ నిర్వాకం మరొకటి వెలుగు చూసింది. ప్రజాధనంతో ఆయన సొంత ఇల్లు నిర్మించుకున్నారు. దీనిపై స్పష్టమైన సాక్ష్యాలతో కేంద్రానికి ఫిర్యాదు అందడంతో.. నోటీసులు జారీ అయ్యాయి. రాపాక వరప్రసాద్ వ్యవహారశైలి ఇప్పుడు సంచలనంగా మారింది.
కేంద్రం ఎంపీ అభివృద్ధి నిధులను మంజూరు చేస్తుంది. అలా రాజోలు నియోజకవర్గానికి నిధులు మంజూరు చేసింది. రూ. పన్నెండు లక్షలతో కత్తిమండ అనే గ్రామంలో రోడ్డు వేయడానికి ప్రతిపాదనలు పంపారు.బిల్లులు మంజూరు చేయించుకున్నారు. రోడ్డు వేశారు. కానీ ఎక్కడ వేశారంటే.. ఎమ్మెల్యే రాపాక ఇంట్లో వేశారు. మెయిన్ రోడ్డు మీద నుంచి ఆయన ఇల్లు ఉన్న స్థలంలో రోడ్డు వేశారు. అది పూర్తిగా ప్రైవేటు స్థలం ఆయన ఇల్లు ఉన్న స్థలం చుట్టూ ప్రహరీ ఉంటుంది. ఆ ప్రహారీ లోపల.. రోడ్డు వేశారు. సొంత ఇంటికి .. ప్రైవేటు స్థలంలో వ్యక్తిగత అవసరాలకు రోడ్డు వేసుకున్నారు.
తాను ప్రజాధనంతో సొంత రోడ్డు వేసుకున్నట్లుగా ఫిర్యాదులు వెళ్లడంతో వచ్చిన నోటీసుపై రాపాక విచిత్రంగా స్పందించారు. తనను కలవడానికి ఇంటికి వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండానే తన వ్యక్తిగత ఇంట్లో రోడ్డు నిర్మించుకున్నారట. అదీ కూడా పంచాయతీ తీర్మానం చేసిందట. ఆయన చెప్పిన సమాధానం విని అధికారులకు మైండ్ బ్లాంక్ అయి ఉంటుంది. ఇటీవలే.. తాను దొంగ ఓట్లతో గెలిచానని చెప్పుకున్న ఆయనకు ఈసీ నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు ప్రజాధనం దుర్వినియోగం కేసుల్లో నోటీసులు వచ్చాయి. మొత్తంగా జనసేన ఎమ్మెల్యే అన్నిరకాల అక్రమాలకూ పాల్పడుతున్నారు.
గెలిపించిన పార్టీని మొదటే కాదని.. పార్టీ ఫిరాయించారు. అనైతిక చర్యలకు పాల్పడ్డారు.ఇప్పుడు అక్రమాల విషయంలోనూ ఏమీ తగ్గట్లేదు.