ఊసరవెల్లి సినిమాలో ఎన్టీఆర్ ఒక డైలాగ్ చెబుతాడు.. ధైర్యవంతుడితో యుద్ధం చేయడం ఈజీ.. కానీ భయస్తుడితోనే ప్రమాదం అని. ఎందుకంటే భయస్తుడు తిరగబడితే ఎలా కొడతాడో, ఏ రేంజ్లో విధ్వంసం సృష్టిస్తాడో వాడికే తెలియదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా కూటమి ప్రభుత్వం సరిగ్గా అదే భయం మోడ్‌లోకి వెళ్లాల్సిన సమయం వచ్చినట్లు కనిపిస్తోంది. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి లాంటి చోటా నేతల నుంచి జగన్ రెడ్డి వరకూ అందరూ ఇప్పుడు ఒకటే పాట పాడుతున్నారు.. అదే రప్పా రప్పా. అధికారంలో వచ్చాక పారిపోయినా పట్టుకొస్తాం.. రప్పా రప్పా నరుకుతాం అని వారు ఇస్తున్న బిల్డప్ చూస్తుంటే, కామెడీ సినిమాల్లో విలన్ల కంటే ఘోరంగా అనిపిస్తోంది.
భయం వెనుక అసలు కిక్కు
నిజానికి ఈ వైసీపీ నేతలు చేస్తున్న బెదిరింపుల వెనుక ఉన్నది మేము వస్తాం అనే భ్రమ మాత్రమే కాదు. వచ్చినప్పుడు చూద్దాంలే అని కూటమి ప్రభుత్వం ఇస్తున్న వెసులుబాటు కూడా. ఊసరవెల్లి సినిమాలో హీరో భయంతో వణికిపోతూనే విలన్లను చీల్చి చెండాడినట్లు, ఇప్పుడు కూటమి నేతలు కూడా ఈ రప్పా రప్పా బ్యాచ్‌ను చూసి భయపడాల్సిన అవసరం కనిపిస్తోంది. వారు వచ్చినా రాకపోయినా, ఈ రోజే ఆ రుచి చూపించాలి. అప్పుడు కానీ వాళ్లకు అర్థం కాదు.. రప్పా రప్పా అంటే నోటి మాట కాదు, చట్టం చేతిలో ఉండే తలరాత అని.
కవర్ డ్రైవ్ సెటైర్లు
జైలుకు వెళ్తూ కూడా సానుభూతి కోసం వెతుక్కుంటున్నారు. ఒకప్పుడు కటకటాల వైపు కన్నెత్తి చూడని వారు, ఇప్పుడు జైలుకు వెళ్లడాన్ని ఒక పొలిటికల్ డిగ్రీ లా ఫీల్ అవుతున్నారు. వీరికి భయం అనేది లేకపోవడానికి కారణం.. ప్రభుత్వం చూపిస్తున్న అతి మర్యాదలే అనిపిస్తోంది. ఉసరవెల్లి సినిమాలో హీరోలాగా భయపడుతున్నట్లు కనిపిస్తూనే, లోపల ఉన్న వైల్డ్ వెర్షన్‌ను బయటకు తీసి, ఈ బూతుల బ్యాచ్‌కు చట్టం పవర్ ఏంటో చూపించకపోతే.. ఈ రప్పా రప్పా సౌండ్లు ఇంకాస్త ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.
వాళ్లకు భయం రియాక్షన్ తెలియచేయాలిగా !
సిద్ధం.. సిద్ధం అంటూ తిరిగిన వారు ఇప్పుడు సెల్ఫీలు ఇచ్చుకుంటూ, కోర్టు మెట్లు ఎక్కుతూ కూడా అదే పాత రికార్డును ప్లే చేస్తున్నారు. నిజంగానే ఆ భయంకరమైన ఎటాక్ ఎలా ఉంటుందో వీరికి రుచి చూపించాల్సిన బాధ్యత ఇప్పుడు పాలకుల పైనే ఉంది. అప్పుడే ఈ చోటా లీడర్లు బెదిరింపులు ఆపి, కనీసం చట్టాన్ని గౌరవించడం నేర్చుకుంటారు. సినిమా క్లైమాక్స్‌లో హీరో రివీల్ అయినట్లు.. కూటమి ప్రభుత్వం కూడా తన అసలు పవర్‌ను చూపిస్తే తప్ప, ఈ నరుకుతాం.. కోస్తాం అనే డైలాగుల డబ్బాలు ఆగవు.