జయలలిత – శోభన్ బాబు మధ్య ఉన్న బంధం సమ్‌థింగ్ స్పెషల్ అనే చెప్పుకోవాలి. వీరిద్దరూ కలసి నటించింది ఒక్క సినిమానే.. అది డాక్టర్ బాబు. అయితే ఆ ఒక్క సినిమానే ఇద్దరి మధ్య బలమైన స్నేహానికి పునాది వేసింది. అప్పట్లో జయ – శోభన్‌లపై చాలా పుకార్లు వచ్చాయి. అయితే వీటిపై స్పందించడానికి అటు జయ, ఇటు శోభన్ బాబు ఇద్దరూ ఆసక్తి చూపించలేదు. తనకు అత్యంత ఇష్టమైన కథానాయిక జయలలిత అని చాలా సార్లు చెప్పారు శోభన్ బాబు. వీరాభిమన్యు తరవాత శోభన్ బాబు – జయలలితలతో ఓ సినిమా పట్టాలెక్కాల్సింది. అయితే అంతా ఓకే అనుకొన్న సమయంలో ఆ నిర్మాత డ్రాప్ అయిపోయాడు. జయలలితతో పనిచేసే అవకాశం చేజారిపోవడంతో శోభన్ బాబు చాలా దిగాలు పడ్డాడట. తన దగ్గరకు వచ్చిన ప్రతీ నిర్మాత తోనూ ‘మన సినిమాలో హీరోయిన్ గా జయలలితను తీసుకోవొచ్చు కదా’ అని ఆశగా అడిగేవాడట.
అయితే అందుకు నిర్మాతలు మాత్రం ఒప్పుకొనేవారు కాదు. దానికి కారణం.. శోభన్ బాబు కొత్త కుర్రాడు. జయ అప్పటికే తమిళంలో స్టార్ హీరోయిన్. శోభన్ బాబు పక్కన నటించడానికి జయ ఒప్పుకోదేమో అన్నది వాళ్ల భయం. అలా చాలా కాలం జయ కోసం నిరీక్షించాల్సివచ్చింది. డాక్టర్ బాబుతో ఆ కల నెరవేరింది. శోభన్‌బాబుపై తనకున్న అభిమానాన్ని జయ కూడా చాలాసందర్భాల్లో చెప్పారు. ‘నా ఒంటరి తనం పోగొట్టిన ఆత్మీయుడు’ అంటూ.. శోభన్‌బాబు గురించి ప్రస్తావించారు. అలా.. జయ – శోభన్ బాబు ఎటాచ్మెంట్ అప్పట్లో తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్ని ఆకర్షించింది. జయ ముఖ్యమంత్రి అయిన తరవాత.. రాజకీయాల్లో బిజీ అయిన తరవాత… జయని కలుసుకోవడానికి ఇష్టపడలేదు శోభన్‌బాబు. జయలలిత కూడా.. క్రమంగా శోభన్‌కి దూరమయ్యారు.