నా బిడ్డ సచ్చిందన్నారు..
కానీ మట్టే వణికిపోయింది.. నా బిడ్డ రక్తాన్ని దాచలేక.
గాలే ఆగిపోయింది.. నా బిడ్డ ఊపిరి మోయలేక..
అగ్గే బూడిద అయ్యింది… మండుతున్న బిడ్డని చూడలేక.
ఆఖరికి చావే చచ్చిపోయింది… నా బిడ్డని చంపలేక..
– ఇలాంటి డైలాగులో మాస్ హీరో ఎంట్రీ ఇస్తే, థియేటర్లో ఫ్యాన్స్ హంగామా ఓ రేంజ్లో ఉంటుంది. ఇలాంటి ఎలివేషన్లు ఇప్పుడు రష్మికకు పడబోతున్నాయి. రష్మిక కథానాయికగా నటిస్తున్న సినిమా ‘మైసా’. రవీంద్ర పుల్లె దర్శకుడు. ఇటీవలే షూటింగ్ మొదలైంది. ఇప్పుడు టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. రష్మిక పాత్రని పరిచయం చేస్తూ.. ఈశ్వరీ రావు చెప్పిన డైలాగులతో ఈ గ్లింప్స్ కట్ చేశారు. ఇటీవలే ‘గాళ్ ఫ్రెండ్’లో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించిన రష్మికకు ఇది మరో నయా అవతార్ అని చెప్పొచ్చు. వీరనారి పాత్రలో రష్మిక ఓ విధ్వంసం చూపించబోతోందన్న విషయం ఈ గ్లింప్స్ తో అర్థమైంది. తన కెరీర్లో మైసా ప్రత్యేక చిత్రంగా మిగిలిపోతుందన్న భరోసా ఈ విజువల్స్ ఇచ్చాయి. యాక్షన్ కి పెద్ద పీట వేశారు. తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతోంది. రావు రమేష్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.
