నటుడిగా కంటే, దర్శకుడిగానే రవిబాబుకి ఫ్యాన్ ఉంటారు. అల్లరి, అవును, అనసూయ లాంటి విభిన్నమైన చిత్రాల్ని అందించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొన్నాడు. అలాంటి రవిబాబు నుంచి కూడా కొన్నాళ్ల నుంచి సరైన ప్రొడక్ట్ రావడం లేదు. ఈమధ్య ‘ఏనుగు తొండం ఘటికాచలం’ అనే ఓ సినిమా తీశారు. అది కూడా ఓటీటీకే పరిమితం అయ్యింది. ఇప్పుడు వెండితెరపై భయంకర రక్తపాతం సృష్టించే ఉద్దేశంతో ఓ సినిమా తీశారు. దీనికి ‘రేజర్’ అనే టైటిల్ పెట్టారు. టైటిల్ గ్లింప్స్ ని ఈరోజు విడుదల చేశారు. టైటిల్ కార్డులో 18 ఏళ్లు దాటిన వాళ్లే ఈ గ్లింప్స్ చూడాలన్న హెచ్చరిక జారీ చేశారు. దాన్ని బట్టి గ్లింప్స్ ఏ స్థాయిలో కట్ చేశారో అర్థం అవుతుంది.
గ్లింప్స్ నిండా రక్తపాతమే. తల – మొండెం వేరైపోవడం, మనిషి రెండు ముక్కలవ్వడం… ఇవే గ్లింప్స్ నిండా. చివర్లో రవిబాబు ఎంట్రీ ఇచ్చాడు. గ్లింప్స్ లోనే ఇలా ఉంటే, సినిమాలో ఇంకెంత బీభత్సం ఉందో..? సురేష్ బాబు ఈ చిత్ర నిర్మాణంలో భాగం పంచుకొన్నారు. 2026 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.
రవిబాబు ఇది వరకు కూడా కొన్ని క్రైమ్ కథలు తీశాడు. కానీ ఇంత రక్తపాతం ఎక్కడా చూళ్లేదు. మరి వెండి తెరపై ఈ హింసని ప్రేక్షకులు ఎలా తట్టుకొంటారో, సెన్సార్ ఎలా అనుమతి ఇస్తుందో చూడాలి.
