….. ఇట్లు రవిప్రకాష్..!

టీవీ9 కొత్త యాజమాన్యం పెట్టిన “బోనస్ కేసు”లో రిమాండ్‌లో ఉన్న రవిప్రకాష్ ప్రజలు, పాత్రికేయలను ఉద్దేశిస్తూ.. ఓ లేఖ రాశారు. కొన్నాళ్లుగా తనకు ఎదురవుతున్న పరిణామాలు.. వాటి వెనుక ఉన్న పరిస్థితులు… మీడియా ఎదుర్కొంటున్న విపత్కర దుస్థితిపై అనేక అంశాలను ఆ లేఖలో ప్రస్తావించారు. తెలుగు 360కి పంపిన ఆ లేఖ వివరాలు ఇవి..!

ప్రజలు, పాత్రికేయులకు..!

శనివారం ఉదయం ఇంటి నుండి బయటకొచ్చిన సమయంలో పది మంది మఫ్టీ పోలీసులు, ప్రైవేటు గుండాలు చుట్టుముట్టారు. టీవీ9లో మీ షేర్‌లు రామేశ్వరరావుకు ఉచితంగా ఇవ్వాలి, మీడియా నుండి తప్పుకోవాలి, లేకపోతే జైలుకు పోక తప్పదని హెచ్చరించారు. మీరు ప్రభుత్వం తరుపునా… లేక రామేశ్వరరావు మనుషులా…? అన్న ప్రశ్నకు ‘ఆయన సీఎం కంటే పవర్‌ఫుల్‌’ అనే సమాధానం వచ్చింది. ఏ కేసులో జైలుకెళ్లాలని ప్రశ్నించగా ఆ విషయం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాక చెబుతామన్నారు. ఎలాగైనా రవిప్రకాశ్‌ను జైలుకు పంపాలని, దసరా సెలవులను చూసుకొని కొత్త కేసు బనాయించారు. కంప్లైంట్‌ మీద కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా, కంపెనీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి అధికారాలు లేని పోలీసులు రవిప్రకాశ్‌ను హడావిడిగా జైలుకు పంపించారు. ఓవైపు హైకోర్టు ఆదేశాలుండగా మరో ఎఫ్.ఐ.ఆర్‌ను సృష్టించటం కింది స్థాయి పోలీసులకు నచ్చలేదు. రామేశ్వరరావు-కృష్ణారెడ్డి సూపర్ సీఎంలుగా వ్యవహరిస్తున్నారని, వారి ఆదేశం మేరకే ఈ చట్ట వ్యతిరేక కార్యక్రమం చేస్తున్నామని వారు బాధపడ్డారు. మీరు మీడియాతో మాట్లాడితే… వారి బతుకు బయటపడుతుంది కాబట్టి, మీకు మీడియాతో మాట్లాడే అవకాశం ఇవ్వొద్దన్నారని పోలీసులు చెప్పారు. దీంతో… మౌనంగా జైలులోకి వెళ్లవలసి వచ్చింది.

ఈ సంక్షోభ సమయంలో జర్నలిజం అనే ఉద్యమాన్ని సమున్నతంగా నిలబెట్టి… పాత్రికేయ విలువల గురించి పోరాడాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది. వేల ఎకరాల భూముల్ని, నిరుపేద రైతుల అమాయకత్వం పెట్టుబడిగా ఆక్రమించిన భూబకాసురులు, టెండర్లలో వేలకోట్ల ఖర్చు పెంచి ప్రజాధనాన్ని దోచుకుంటున్న కాంట్రాక్టర్లు ఈ రోజు మీడియా పై కన్నేశారు. హైదరాబాద్‌లో వందల బినామి కంపెనీలు సృష్టించి, వేల ఎకరాల భూమిని గుప్పిట్లో పెట్టుకున్న మైం హోమ్ రామేశ్వరరావు మీడియా మొత్తం తన కాళ్లకిందకు రావాలని రంకెలు వేస్తున్నారు. అనవసర ప్రాజెక్టులు ప్రభుత్వాలకు అంటగట్టి, కాంట్రాక్టుల వ్యయం విపరీతంగా పెంచి… నేతలకు వాటాలు పంచి, వేల కోట్లలో విహారిస్తున్న మెఘా కృష్ణారెడ్డి మీడియా కబ్జా కాండలో తన వంచనా ప్రతిభనంతా చూపిస్తున్నాడు. మీడియా మొత్తం చెప్పుకింద ఉంటే తమ అక్రమాలను ప్రశ్నించే వాడు ఎవడూ ఉండడని, వీరి నమ్మకం. ఆక్రమణలు, అక్రమాలు చేసేటప్పుడు వీరు, మేం కేసీఆర్ బినామీలమని సామాన్యుడిని బెదరించటమే కాకుండా… పోలీసులను భాగస్వాములను చేస్తున్నారు.

వీరి మీడియా గేమ్‌ ప్లాన్‌ తెలియాలంటే… మోజోటీవీ హాత్య గురించి తెలుసుకోవాలి. 5నెలల క్రితం మోజోటీవీ ఆక్రమణ మొదలుపెట్టారు. కొంతమంది యువ జర్నలిస్ట్‌లు నడుపుతున్న మోజోటీవీపై మీడియా కబ్జా పిచ్చిపట్టిన రామేష్-కృష్ణా ద్వయం కన్నుపడింది. వెంటనే మోజో టీవీ సీనీయర్ స్టాప్‌ను పోలీస్‌స్టేషన్‌లో ఉంచి బెదిరించారు. మహిళ సీఈవో రేవతిని ఎనిమిది రోజులు జైలుకు పంపారు. సీనీయర్లను పోలీసులతో బెదిరించి, షేర్లన్నీ ఉచితంగా తమ బినామీ పేర్ల మీద మార్పించారు. మోజోటీవీని ఆక్రమించిన తర్వాత రెండు నెలలు తిరగకుండానే చానల్‌ను మూసి… 160మంది జర్నలిస్ట్‌లను రోడ్డు పాలు చేశారు. చానల్‌ పరికరాలను అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. మీడియా కబ్జాకాండకు మోజో పరాకాష్ట.

ఈ ఇద్దరి మీడియా కబ్జాకాండ ఎన్టీవీతో ప్రారంభమైంది. ఎన్టీవీలో పెట్టుబడి పెట్టి దారికి తెచ్చుకున్న తర్వాత పేదల గొంతుక వినిపిస్తున్న 10టీవీ మీద పడ్డారు. 10టీవీలో పెట్టుబడులు పెట్టిన లక్షా ఎనబైవేల మంది సామాన్యులను నిలువునా ముంచి, చానల్‌ను స్వాధీనం చేసుకున్నారు. న్యూస్‌ చానల్స్‌ ఆక్రమణ కార్యక్రమంలో వీరికి నిమ్మగడ్డ ప్రసాద్, అతని అనుచరుడు సింగారావ్‌ జతకలిశారు. అయితే… ఎదురులేదనుకున్న మీడియా ఆక్రమణకు టీవీ9 యాజమాన్యం వ్యతిరేకత ఇబ్బందిగా మారింది. దీంతో మెఘా కృష్ణారెడ్డి రంగంలోకి దిగారు. టీవీ9లో ఇప్పటి మేనేజ్‌మెంటే కొనసాగుతుందని, నమ్మ బలికి అత్యధిక వాటాలున్న శ్రీనిరాజుకు తెల్లాపూర్‌ భూమిని ఎరవేశారు. 2000కోట్ల భూమిని 350కోట్లకు కేటాయించుకొని, 1650కోట్ల లాభం పంచుకోవాలని ప్లాన్‌ వేశారు. సంవత్సరానికి 270కోట్లు సంపాదించే టీవీ9ను 257కోట్లకే కొన్నట్లు కాగితాలు పుట్టించారు. ఈ కుంభకోణాన్ని ప్రశ్నించినందుకు రవిప్రకాశ్‌ మీద దొంగకేసులు పెట్టారు. దొంగదారి నుండి డైరెక్టర్లయ్యారు. 200మంది పోలీసుల సహాయంతో… 100మంది బౌన్సర్ల సహాయంతో టీవీ9లోకి ప్రవేశించారు.

సీనీయర్‌ మేనేజ్‌మెంట్‌ను పోలీస్‌ స్టేషన్ల చుట్టు తిప్పి వేధించారు. అయితే… కంపెనీ షేర్ల వివాదంలో క్రిమినల్ కేసులేంటని హైకోర్ట్ నిలదీయటంతో వీరికి ఎదురుదెబ్బ తగిలింది. టీవీ9 వ్యవస్థాపక చైర్మన్‌గా, సీఈవోగా, డైరెక్టర్‌గా, షేర్‌హోల్డర్‌గా రవిప్రకాశ్‌ కొనసాగుతున్నారు. 15ఏళ్ల కృషి, అనుభవం, అనుబంధం ఇంకా టీవీ9తోనే ఉన్నాయి. కేసులతో ఉక్కిరిబిక్కిరి చేస్తే… రవిప్రకాశ్‌ 15ఏళ్ల కష్టాన్ని, శ్రమను వదిలిపెట్టి మాకు పాదాక్రాంతుడై పడి ఉంటాడన్నది వీరి విశ్వాసం. నిరుపేద రైతుల్ని, పోలీస్, రెవెన్యూ, కోర్ట్‌ భయాలకు లోనుచేసి అతిచవక ధరకు భూమిని ఆక్రమించి, కొనుగోలు చేసినట్లు చూపించే వీరి చాతుర్యం ప్రస్తుతం మీడియా రంగంలో ప్రదర్శితమవుతోంది. రవిప్రకాశ్ మొదలుపెట్టి నామకరణం చేసిన సంస్థ, 15ఏళ్లు విస్తరించిన సంస్థ నుండి రవిప్రకాశ్‌ను బయటకు పంపడానికి రామేశ్-కృష్ణలకు పోలీస్‌ బలం, దొంగకేసుల సహాయం అవసరమైంది. తమ కబ్జాలో ఉన్న మీడియాలో ఫోర్జరీ, మోసం కథనాల్ని నిరంతరం నడిపించి, మిగిలిన మీడియాపై అన్ని రకాల ఒత్తిళ్లు చేసి వాస్తవాలను అణచివేసి బాగా బురద జల్లామని వీరు పండగ చేసుకుంటున్నారు.

దొంగదారి నుండి సంస్థలో చొరబడి ప్రోఫెషనల్స్‌ను అక్రమ కేసుల్లో ఇరికించిన రామేశ్-కృష్ణ ద్వయం టీవీ9లో భయోత్పాత పరిస్థితుల్ని సృష్టించింది. నిమ్మగడ్డ ప్రసాద్ కుడిభుజం సింగరావ్ సహాకారంతో టీవీ9లో జర్నలిజం, జర్నలిస్ట్‌ల నిర్మూలన కార్యక్రమం మొదలుపెట్టింది. లాభల నుండి నష్టాల్లోకి సంస్థ దిగజారింది. సంస్థ వాటా దారునిగా రవిప్రకాశ్‌ కూడా నష్టపోయే పరిస్థితి వచ్చింది. 15ఏళ్లుగా టీవీ9ను ప్రోఫెషనల్‌గా నడిపిన యాజమాన్యం ఎప్పుడూ జర్నలిస్ట్‌ల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చింది. దేశంలోనూ, రాష్ట్రంలోనూ న్యూస్‌ చానల్స్‌ నష్టాల్లో నడుస్తున్న తరుణంలో టీవీ9 సగర్వంగా లాభాలు ప్రకటించింది. ఈ లాభాల్లో సీనీయర్‌ ప్రొఫెషనల్స్‌ను వాటాదారులుగా చేసింది. అయితే, జర్నలిస్ట్‌లను, ప్రొఫెషనల్స్‌ను జీతగాళ్లుగా, పాలేర్లుగా చూసే రామేశ్-కృష్ణ ద్వయం ఇప్పుడీ నిర్ణయాన్ని ప్రశ్నిస్తోంది.

రవిప్రకాశ్‌ నేతృత్వంలోని కంపెనీ బోర్డ్ ప్రతి సంవత్సరం సీనీయర్ సిబ్బందికి బోనస్‌ ఇవ్వటం ఆనవాయితీ. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా ఉన్న సీనీయర్లకు ఎప్పట్లాగే బోనస్‌ ప్రకటించింది. ఇది రామేశ్-కృష్ణ ద్వయానికి మింగుడు పడలేదు. బోనస్‌గా ఇచ్చిన డబ్బు దుర్వినియోగం అయిందని వీరు ఆరోపిస్తున్నారు. ఉద్యోగులను జీతగాళ్లుగా చూస్తున్న వీరికి సిబ్బందికి లాభాలు పంచటం, ప్రొఫెషనల్స్‌ ఆత్మవిశ్వాసంతో నిలబడటం ఇష్టంలేదు. అర్ధాకలితో ఉద్యోగులుంటే ‘బాంచన్ నీ కాల్మొక్త’ అని చెప్పులిప్పి దండం పెడతారు. సరైన వేతనాలిస్తే ధీమాగా ఆత్మవిశ్వాసంతో నిలబడతారు. వీరికి ఉద్యోగులు కాదు వెట్టి కార్మికులు కావాలి. తాజా కేసు ఇదే. ఉద్యోగులకు సంస్థ విజయంలో వాటా ఉండి తీరాలి. జర్నలిస్ట్‌లు ఆత్మవిశ్వాసంతో నిలబడి పనిచేస్తూ వేతనాలు తీసుకోవాలని మతిమంతులెవరయినా ఆశిస్తారు. సంస్థ లాభాల్లో ఉన్నప్పుడు ఆ లాభాల్లో వాటా కష్టించే వారికి దక్కాలి. పెద్దగా అక్షర జ్ఙానంలేని స్వార్ధపర ఫ్యూడల్‌ శక్తులకి ఈ ఆధునిక మేనేజ్‌మెంట్ పద్దతి చచ్చినా అర్థంకాదు.

రామేశ్-కృష్ణ వంటి వారే ఈ పరిస్థితికి కారణంగా కనిపిస్తోంది. సమాజంలో సంపద ఒకరిద్దరి వద్దే పోగుపడితే ఏమౌతుంది..? పేదలు వ్యవసాయం చేసుకునే భూమిని పెద్దలనే గద్దలు తన్నుకుపోతే ఏమౌతుంది…? ప్రజాధనాన్ని కాంట్రాక్టుల లెక్కల మాయజాలంతో దోచుకొని విలాసాలు చేసుకుంటే ఏమౌతుంది..? ఖజనాకు చిల్లుపడుతుంది. దేశం దివాళా తీస్తుంది. కొందరి అత్యాశ కారణంగా అవకాశం కోల్పోయినవాడు ఆకలేసి రొట్టెముక్కకు ఆశ పడితే శాంతి భద్రతల పేరుతో జైలుకు పంపాల్సి వస్తుంది. మరిన్ని జైలు అవసరమై, వాటి నిర్మాణానికి మళ్ళీ మెఘా కృష్ణ వంటి వారికే కాంట్రాక్టు ఇవ్వాల్సి వస్తుంది. రామేశ్వరరావు కుటుంబం హైదరాబాద్ లో బినామీ కంపెనీల్లో సంపాదించిన వేల ఎకరాలు పంచితే ఒక్కో పేద కుటుంబానికి పది ఎకరాల భూమి వచ్చేదేమో! మెఘా కృష్ణ గారి వేలకోట్లు నిరుద్యోగులకిస్తే ఒక్కో నిరుద్యోగి కనీసం పది లక్షల పెట్టుబడులతో వ్యాపారాలు చేసేవాడేమో!

ఇంతకీ.. ఈ కబ్జా కోరుల అన్యాయాన్ని ప్రశ్నించాల్సిన రాజకీయ నాయకులెక్కడ? ఎక్కడో కొంత మంది తప్ప. ఎవరికి వారు వాటాలకు ఆశపడి ప్రజలకి ద్రోహం చేస్తున్నారు. ఇప్పుడు సామాన్యుడు జర్నలిస్ట్ వైపు చూస్తున్నాడు. జర్నలిస్ట్ నిజం మాట్లాడటానికి బయపడతాడా? నిజాం వ్యతిరేక రచనలు చేసినందుకు కాచిగూడ చౌరస్తా కత్తుల దాడిలో షోయబుల్లాఖాన్ మాత్రమే చనిపోయాడా లేక షోయబ్ మనలో రగిల్చిన ప్రశ్నించే స్పూర్తి కూడా చనిపోయిందా? నయా నిజాంల సంపదల్ని ,విలాసాల్ని కీర్తిస్తూ అడుగడుగునా రాజీపడుతూ శేష జీవితం గడుపుదామా? లేక చెప్పులు వదిలి వంగి దండాలు పెట్టే సంస్కృతిని ధ్వంసించడానికి సిద్దమవుదామా? ప్రజలవైపు నిలిచే మీడియానా…? నయా జాగీర్దారులు, నయా జమిందార్లకు అండగా మీడియానా? ప్రజలే తేల్చుకోండి.

ఇట్లు
రవిప్రకాష్

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అచ్చెన్న కేసులో దర్యాప్తు అధికారిపై మానవ హక్కుల ఉల్లంఘన అభియోగం..!?

అచ్చెన్న కేసులో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని..హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏసీబీ వర్గాల్లో కొత్త కలకలానికి కారణం అవుతున్నాయి. అంతకు ముందు రోజే ఆపరేషన్ జరిగిన ఆయనను ఆరు వందల...

రైతుకు కేసీఆర్ ఫోన్.. విమర్శలకు సమాధానమా..?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై తమకు తక్షణం సమాచారం తెలియాలంటూ.. కొంత మంది కోర్టులను ఆశ్రయిస్తున్న సమయంలో... ఆయన ఓ రైతుతో ఫోన్‌లో మాట్లాడినట్లుగా సీఎంవో మీడియాకు సమాచారం పంపింది. ఫామ్‌హౌస్‌లో...

ఏపీ సీఎంవోలో వన్ అండ్ ఓన్లీ ప్రవీణ్ ప్రకాష్..!

నేను ఒక్క సారి చెబితే వంద సార్లు చెప్పినట్లు అని ఓ సినిమాలో రజనీకాంత్ అంటాడేమో కానీ.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగంలో సీనియర్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్.. ఒక్క సారి చెబితే...

జగన్ వరం.. ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్స..!

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ కోవిడ్ ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. సౌకర్యాలు సరిపోని పరిస్థితి. ఇలాంటి సమయంలో.. ప్రభుత్వం ప్రైవేటు చికిత్సకు అనుమతులు మంజూరు చేసింది. ఆరోగ్యశ్రీ కింద.. కరోనాకు.. చికిత్స...

HOT NEWS

[X] Close
[X] Close