తెలుగు మీడియాలో రవిప్రకాష్ గురించి పరిచయం అవసరం లేదు. తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా విప్లవానికి ఆయనే ఆద్యుడు. అయితే సక్సెస్ ఎప్పుడూ నిటారుగా ఉండదు.. ఎత్తుపల్లాలుంటాయి. రవిప్రకాష్ కూడా కొంత కాలంగా గడ్డుపరిస్థితని ఎదుర్కొన్నారు. కానీ మొక్కవోని పట్టుదలతో ఆయన సొంత ఆర్టీవీ బ్రాండ్ ను మెల్లగా నిర్మించుకుంటున్నారు.
ఎన్నో పరిమితులు ఉన్నా… మెల్లగా ఆర్టీవీని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. తాజాగా ఆయన బయటపెడుతున్న సంచలన విషయాలే హాట్ టాపిక్ అవుతున్నాయి. ఎన్నికలకు ముందు స్టడీ పేరుతో ప్రకటించిన సర్వేలను చాలా మంది తేలికగా తీసుకున్నారు. రవిప్రకాష్ ఎవరిపైనో కోపంతోనే.. మరెవరిపైనో అభిమానంతోనే చెబుతున్నారని అనుకున్నారు.. సోషల్ మీడియాల్లో విశ్లేషించారు.
కానీ తెలంగాణ పార్లమెంట్ సీట్లలో ఆయన చెప్పిందే నిజమైంది. ఏపీలో లో కూటమి గెలుస్తుంది కానీ.. వైసీపీ మంచి సీట్లు సాధిస్తుందని ఆయన అంచనా వేశారు. కానీ నిశ్మబ్ద విప్లవాన్ని కూడా ఊహించారు. అది కూడా చెప్పారు. ప్రజల్లో ఉన్న నిశ్మబ్ద విప్లవం కరెక్ట్ అయితే కూటమికి 150కిపైగా సీట్లు వస్తాయని చెప్పారు. అదే నిజమైంది. అప్పట్నుంచి ఆయన మీడియా సంస్థకు అన్నీ మంచి రోజులే కనిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ , బీజేపీ విలీన విషయాన్ని ప్రకటించారు. ఢిల్లీ ఎన్నికల తర్వాత ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. ఇప్పటికిప్పుడు ఖండించినా అదే జరగబోతోందని ఎక్కువ మంది ఆ రెండు పార్టీల నేతలూ నమ్ముతున్నారు. ఇక మేఘా కంపెనీ బ్యాంక్ గ్యారంటీ స్కామ్‌ను .. యూరో ఎగ్జిమ్ బ్యాంకు వ్యవహారాన్ని కూడా బయటపెట్టి పోరాడుతున్నారు. నోటీసులు, కుట్రలు ఎన్ని చేస్తున్నా రవిప్రకాష్ తగ్గడం లేదు. ఆయన రెండో ఇన్నింగ్స్ ఇప్పుడు జోరందుకుంటోందని అనుకోవచ్చు.