మాస్ మహారాజా రవితేజకు అర్జెంటుగా ఓ హిట్టు కావాలి. లేదంటే ఆయన ఫ్యాన్సే ఒప్పుకొనేలా లేరు. ‘మాకో హిట్టు ఇవ్వండి రవన్నా’ అంటూ సోషల్ మీడియా సాక్షిగా హోరెత్తిపోతున్నారు. తాను మారాల్సిన అవసరాన్ని రవితేజ కూడా గుర్తించారు. అందుకే ఎలాంటి హడావుడి లేకుండా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే సినిమా తీశారు. అదును చూసుకొని, మంచి సీజన్ (సంక్రాంతి)కి విడుదల చేశారు. కానీ వర్కవుట్ అవ్వలేదు. రవితేజ గత సినిమాల కంటే కాస్త డిఫరెంట్ గా ఉందన్న పేరైతే వచ్చింది. కానీ హిట్టు మాత్రం బాకీ.
ప్రస్తుతం ‘ఇరుముడి’ అనే సినిమా చేస్తున్నారు రవితేజ. శివ నిర్వాణ దర్శకుడు. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. రవితేజ పుట్టిన రోజు సందర్భంగా ఇటీవల ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అయ్యప్ప స్వామి మాలలో రవితేజ లుక్ ఫ్రెష్ గా ఉంది. ఇలాంటి లుక్ లో ఓ హీరోని చూడడం ఇదే తొలిసారి. అందుకే కాస్త ఫ్రెష్ నెస్ వచ్చింది. కథ, కథనం, హీరో క్యారెక్టరైజేషన్ లోనూ ఆ మార్పు స్పష్టంగా కనిపించబోతోందని సమాచారం. రవితేజ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నారని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. రెండు పాత్రలు చేయడం రవితేజకు కొత్త కాదు. కానీ ఆ రెండు పాత్రల్లో వేరియేషన్స్ చాలా బాగా కుదిరాయన్న టాక్ మాత్రం వినిపిస్తోంది. రెండు పాత్రలా, మూడు పాత్రలా అనేది ఇప్పుడు ప్రధానం కాదు. రవితేజ హిట్టు కొట్టాలంతే. అందుకోసం ఆయన ఏ మేరకు తనని తాను మార్చుకొంటారన్నది ప్రధానం. ఏం జరుగుతుందో చూడాలి.