రవితేజ – కిషోర్ తిరుమల కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. కేతిక శర్మ, అషికా రంగనాథ్ కథానాయికలు. ఎస్.ఎల్.వి. సినిమాస్ సంస్థ రూపొందిస్తోంది. ఈ చిత్రం కోసం ‘అనార్కలీ’ అనే టైటిల్ అనుకొంటున్నారని ఇది వరకు వార్తలొచ్చాయి. అయితే ఈ సినిమాకు ఇప్పుడు ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే సరదా టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. సాధారణంగా ‘భక్త మహాశయులకు విజ్ఞప్తి’ అంటుంటాం. ఇది భర్తల కథ కాబట్టి.. టైటిల్ ని అలా మార్చారు.
2026 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్నది ప్లాన్. షూటింగ్ శర వేగంగా సాగుతోంది. త్వరలోనే ఫస్ట్ లుక్ విడుదల చేసే అవకాశం ఉంది. గ్లింప్స్ కూడా రెడీ చేశారు. దసరా సందర్భంగా టైటిల్ ప్రకటిద్దామనుకొన్నారు. కానీ రవితేజ చేతిలో ‘మాస్ జాతర’ సినిమా ఉంది. ఈనెల 31న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అది అయ్యాకే కిషోర్ తిరుమల సినిమా ప్రమోషన్లు మొదలుపెట్టాలని భావిస్తోంది చిత్రబృందం. 2026 సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో అన్నీ కుటుంబ కథా చిత్రాలే. ‘రాజాసాబ్’ లో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి. ‘మన శివ శంకర ప్రసాద్‌గారు’ ఎలాగూ ఫ్యామిలీ డ్రామానే. రవితేజ సినిమా కూడా ఆ కోవలోని కథే.