రవితేజ ఆ కథ విన్నాడట, ఈ కథ ఓకే చెప్పాడట, ఆ డైరెక్టరు రవితేజతో సినిమా చేస్తాడట, ఈ నిర్మాత అడ్వాన్స్ ఇచ్చాడట… అంటూ బోల్డన్ని వార్తలు ఈమధ్య రొటీన్‌గా పలకరిస్తున్నాయి. అయితే రవితేజ మూడ్ సినిమాలపై లేదని స్పష్టంగానే అర్థమవుతోంది. పారితోషికం పెంచి.. నిర్మాతల్ని భయపెడుతున్నాడని, అందుకే సినిమాలు చేజారిపోతున్నాయని చెబుతున్నారు. ఈలోగా విక్రమార్కుడు 2 అంటూ మరో వార్త బయటకు వచ్చింది. విజయేంద్ర ప్రసాద్ విక్రమార్కుడికి సీక్వెల్ రెడీ చేశారని, త్వరలోనే దాన్ని టేకప్ చేసే అవకాశాలున్నాయన్నది ఈ వార్తల సారాంశం. విక్రమార్కుడు అనేది రవితేజ కెరీర్లో బంపర్ హిట్. అందులో అత్తిలి సత్తిగా నవ్విస్తే, విక్రమ్ రాథోడ్‌గా విజృంభించాడు రవితేజ. ఆయనకు ఇది టేలర్ మేడ్ సినిమానే. విక్రమార్కుడు 2 అనగానే మార్కెట్ అమాతంగా మొదలైపోతుంది. కాబట్టి భేషుగ్గా ఈ సినిమా చేసేయొచ్చు.
అయితే ఈ సినిమా చేయడానికైనా రవితేజ రడీగా ఉన్నాడా? అంటే నిరాశాజనకమైన సమాధానమే వస్తోంది. విక్రమార్కుడు సీక్వెల్ అనే సౌండింగ్ కూడా మాస్ మహారాజాని టెమ్ట్ చేయలేకపోతోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. రవితేజ ఈ సినిమా చేయడానికీ రెడీగా లేడని తెలుస్తోంది. విక్రమార్కుడు సీక్వెల్ కథ ఇప్పటిది కాదు. విక్రమార్కుడు సమయంలోనే అటు రాజమౌళికీ, ఇటు రవితేజకూ ఈ ఐడియా వచ్చింది. అత్తిలి సత్తిబాబు క్యారెక్టర్ని బేస్డ్ చేసుకొని ఈ సినిమా చేద్దామనుకొన్నారు. అయితే.. కథ అనుకొన్నాక అది వర్కవుట్ కాదని భావించి పక్కన పెట్టేశారు. అదే కథని ఇప్పుడు బయటకు తీశారు. అప్పుడు నచ్చని కథ.. రవితేజకు ఇప్పుడెలా నచ్చుతుంది? పైగా ఈ సినిమాని రాజమౌళి టేకప్ చేయడాయె? అలాంటప్పుడు సూపర్ హిట్ సినిమాని ఏరి కోరి కెలుక్కోవడం ఎందుకు? దానికి తోడు సీక్వెల్ పేరుతో వచ్చిన సినిమాలన్నీ ఢమాల్ అన్నాయి. అందుకే రవితేజ ఈసినిమా చేయడానికి ధైర్యం చేయడని, కేవలం ఇదీ ఓ రకమైన టైమ్ పాస్ వార్తే అని రవితేజ సన్నిహితులు తేల్చేస్తున్నారు.