రవితేజ హిట్టు కొట్టి ఎన్నాళ్లయ్యిందో? ధమాకా మినహాయిస్తే అంతకు ముందు, ఆ తరవాత కూడా ఫ్లాపులే. హిట్టు కొట్టకపోవడం అటుంచితే చేసినవన్నీ రొడ్డ కొట్టుడు సినిమాలే. వైవిధ్యం లేక బాక్సాఫీసు దగ్గర డీలా పడినవి చాలానే ఉన్నాయి. ఫ్యాన్స్ కూడా ఓ స్థాయి వరకే హీరోని మోస్తారు. ఆ తరవాత.. `ఎందకన్నా ఇలాంటి సినిమాలు తీస్తావ్` అని నిలదీస్తారు. సోషల్ మీడియాలో రవితేజ ఫ్యాన్స్ పరిస్థితి ప్రస్తుతం ఇలానే వుంది. `సినిమాలు ఆపేయ్ అన్నా..` అంటూ మొహమాటం లేకుండా కామెంట్లు చేసేస్తున్నారు. రవితేజ ఆ స్థాయిలో చిరాకు పెట్టాడు.
తన విషయంలో ఫ్యాన్స్ పడుతున్న బాధ మాస్ రాజా రవితేజకూ అర్థమైంది. అందుకే ‘మాస్ జాతర’ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో `మొన్నటి వరకూ మిమ్మల్ని కాస్త చిరాకు పెట్టాను. ఇక మీదట అలాంటిది జరగదు. ఇది నా ప్రామిస్` అంటూ ప్రమాణం చేసేశాడు. దాంతో `మాస్ జాతర` ఏమైనా బాగుండొచ్చేమో అన్న నమ్మకం కలిగింది ఫ్యాన్స్‌కు. నిజానికి ఈ సినిమాపై కూడా అభిమానులకు ఎలాంటి భరోసా లేదు. టీజర్, ట్రైలర్ వాళ్లని మెప్పించలేకపోయాయి. పాటలూ అంతంత మాత్రమే. ‘ఇదీ పోయినట్టే’ అన్న ఫస్ట్రేషన్లో ఉన్నారు అభిమానులు. రవితేజ చేసిన ప్రామిస్ తో వాళ్లు కాస్త తెరిపిన పడ్డారు. రవితేజ నుంచి అభిమానులు కొత్తగా కోరుకొనేది ఏమీ ఉండదు. ఆ అల్లరి, ఉత్సాహం తెరపై కనిపిస్తే చాలు. ఖుషీ అయిపోతారు. సరైన కథల్ని, తన ఎనర్జీని పర్ఫెక్ట్ గా తెరపైకి తీసుకొచ్చే దర్శకుడ్ని ఎంచుకొంటే రవితేజ హిట్టు బాట పట్టినట్టే. ‘మాస్ జాతర’తో అలాంటి విజయం లభిస్తుందేమో చూడాలి.
