రవితేజ 75వ సినిమా ‘మాస్ జాతర’. ఏ ముమూర్తంలో ఈ సినిమా మొదలు పెట్టారో కానీ, అసలు బజ్ లేకుండా పోయింది. టీజర్, పాటలు ఇవేం జనంలోకి వెళ్లలేదు. టీజర్ కట్ రవితేజ ఫ్యాన్స్ కు కూడా నచ్చలేదు. ఈమధ్య కాలంలో రవితేజ నుంచి వచ్చిన సినిమాల్లో ‘లో’ బజ్ ఉన్న సినిమా ఇదొక్కటే ఏమో? ఈనెల 31న ఈ సినిమా వస్తోంది. ఆ రోజే ‘బాహుబలి ఎపిక్’ వస్తోంది. ఆ సినిమాతో పోటీ పడడం పెద్ద టాస్కే. పబ్లిసిటీ పరంగా ఇప్పుడిప్పుడే అడుగులు పడుతున్నాయి. 27న ట్రైలర్ వస్తోంది. ఈ ట్రైలర్ కట్ పై సినిమా ఓపెనింగ్స్ ఆధారపడి ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ జనరేషన్ మైండ్ సెట్ మొత్తం మారిపోయింది. టీజర్, ట్రైలర్ తోనే సినిమాకు వెళ్లాలా వద్దా? అనేది డిసైడ్ అయిపోతున్నారు. టీజర్ పరంగా ‘మాస్ జాతర’కు మైనస్ మార్కులు పడతాయి. కనీసం ట్రైలర్ తో అయినా బజ్ తీసుకురావాలని చిత్రబృందం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఓరకంగా ఈ సినిమాపై హైప్ లేదా, బజ్ పెంచడానికి ఇదే లాస్ట్ ఛాన్స్. ట్రైలర్ బాగుంటే సినిమా బాగుండాలన్న రూల్ కూడా లేదు. కాకపోతే.. ఓ మంచి ట్రైలర్ మంచి ఓపెనింగ్స్ కి దారి తీస్తుంది. ఈ విషయం నిర్మాత నాగవంశీ కి కూడా బాగా తెలుసు. సో.. ఆయన కూడా ట్రైలర్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటున్నారు. రవితేజ నుంచి ఫ్యాన్స్ ఆశించే అన్ని అంశాలూ ఈ సినిమాలో ఉన్నాయని నాగవంశీ చెబుతూనే ఉన్నారు. అవన్నీ ట్రైలర్ లో కూడా చూపించాల్సిన అవసరం వుంది. కనీసం ఫ్యాన్స్ కి నచ్చేలా ట్రైలర్ ఉన్నా, ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ వుంది.