ఈనెల 27న రావాల్సిన ‘మాస్ జాతర’ వాయిదా పడింది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ బాకీ ఉందని, పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరగాల్సివుందని చిత్ర బృందం చెబుతున్నా – వాస్తవ పరిస్థితులు పూర్తిగా వేరు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన చిత్రమిది. నాగవంశీ నిర్మాత. ఆయన బ్యానర్ నుంచి ఇటీవల వచ్చిన ‘కింగ్ డమ్’ బయ్యర్లకు నష్టాల్ని మిగిల్చింది. ఇప్పుడు ‘వార్ 2’ కూడా ఆయనే విడుదల చేశారు. ఈ సినిమాని నాగవంశీ పై నమ్మకంతో బయ్యర్లు మంచి రేటుకి కొన్నారు. ఇది కూడా ఫెయిల్యూర్ ప్రాజెక్టే. ఈ సినిమాతో ఎంత పోతుందో తేలాల్సివుంది. ఈ నష్టాల్ని ‘మాస్ జాతర’తో భర్తీ చేయాలంటూ బయ్యర్లు నాగవంశీపై ఒత్తిడి పెంచుతున్నట్టు తెలుస్తోంది. అందుకే ‘మాస్ జాతర’ని వాయిదా వేశారని సమాచారం.
దానికి తోడు మాస్ జాతరకు ఎలాంటి బజ్ లేదు. టీజర్ విడుదల చేసినా పెద్దగా ఇంపాక్ట్ రాలేదు. పైగా ఓ పాట.. అందులోని బూతులు బాగా ట్రోల్ అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో మాస్ జాతరని విడుదల చేసినా పెద్దగా ఫలితం ఉండదన్నది నాగవంశీ నమ్మకం. ఈ ఫ్లాపుల నుంచి తేరుకోవడానికి కూడా ఆయనకు కొంత టైమ్ కావాలి. అందుకే… `మాస్ జాతర`ని వాయిదా వేయాలని నిర్ణయించుకొన్నారు. మాస్ జాతర వస్తోందని ఈనెల 27న వేరే సినిమాలు ఆగిపోయాయి. వాటిలో ఒకటో రెండో.. మాస్ జాతర డేట్ ని భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి.