రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ ప్రాజెక్టు విషయంలో వాస్తవాలను వక్రీకరిస్తున్నారని స్పష్టం చేసింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు జగన్ హయాంలోనే ఆగిపోయాయని ఏపీ ప్రభుత్వం తెలిపింది.
ఈ ప్రాజెక్టు పనులు గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే, ముఖ్యంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాల కారణంగా నిలిచిపోయాయని ప్రభుత్వం గుర్తుచేసింది. జగన్ ప్రభుత్వం హడావుడిగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రారంభించడంతో పర్యావరణ అనుమతులు , ఇతర చట్టపరమైన చిక్కులు తలెత్తాయని, ఆ కారణంగానే పనులు ముందుకు సాగలేదని వివరించింది.
ఎన్జీటీ అనుమతులు కూడా లేకుండా జగన్ హయాంలో నిర్మించడం ప్రారంభించారు. రాష్ట్రానికి కేటాయించిన నీటిని మాత్రమే మేం వాడుకుంటామని.. కృష్ణా బోర్డు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి నీటి కేటాయింపులు చేస్తుందని అప్పట్లో ప్రభుత్వం చెప్పింది. మన నీటిని మనం తీసుకోవడానికి పోతిరెడ్డిపాడు వద్ద కట్టుకుంటున్నామని సీఎం స్పష్టం చేశారు. శ్రీశైలంలో 800 అడుగుల నుంచి తెలంగాణ రాష్ట్రం నీరు తీసుకుంటోందని.. అలాంటప్పుడు.. కేటాయింపుల ప్రకారం మనం నీటిని తీసుకుంటే తప్పెలా అవుతుందని సీఎం వాదించేవారు. అయితే ఇవన్నీ రాజకీయంగా ఓకే కానీ… చట్టపరంగా లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణానికి అవసరమైన అనుమతుల కోసం ప్రయత్నించలేదు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పనులపై ఎన్జీటీతో పాటు పలు చోట్ల ఫిర్యాదులు చేసింది. చివరికి ఎన్జీటీ ఆదేశాలతో పనులు నిలిచిపోయాయి. అయితే ఇప్పుడు తన రిక్వెస్ట్ తో చంద్రబాబు పనులు నిలిపివేశారని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పడం వివాదాస్పదమయింది. దీనికి ప్రభుత్వం వివరణ ఇచ్చింది. కేసీఆర్ హయాంలోనే పనులు ఆగిపోయాయని చెప్పడంతో రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చినట్లయింది.
