పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ రెండు ధోరణులను అవలంభిస్తోంది! నాయకులది ఒక తీరు, అధినాయకుడిది అదో తీరు అన్నట్టుగా ఉంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికీ, కేంద్రం చెబుతున్న నగదు రహితానికి చంద్రబాబు హితంగా ఉంటారు! కానీ, ఇతర తెలుగుదేశం నేతలు మాత్రం… ఈ నిర్ణయం అర్థరహితం అంటూ విమర్శిస్తారు. తాజాగా మరో తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు కూడా పెద్ద నోట్ల నిర్ణయాన్ని తప్పుబట్టారు. ప్రధాని మోడీ నిర్ణయాన్ని ఎంపీ రాయపాటి సాంబశివరావు తీవ్రంగా వ్యతిరేకించారు!
పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఒక బురద అని ఆయన అభివర్ణించడం విశేషం! పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ ఒళ్లంతా బురద అంటించుకున్నారు అన్నారు! అక్కడితో ఆగకుండా ఆ బురదను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి కూడా అంటించారని రాయపాటి చెప్పారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ఒక కమిటీ వేస్తామంటూ చెప్పి, దాన్లో చంద్రబాబును పెట్టి ఆ బురదలోకి ఆయన్నీ లాగారు అన్నారు. నల్లధనం ఉన్నవారిని వదిలేసి, పేదవారిపై మాత్రమే కేంద్రం ప్రతాపం చూపిస్తున్నట్టుగా ఉందన్నారు. పార్లమెంటులో ప్రతిపక్షాలు కూడా క్రియాశీలంగా వ్యవహరించడం లేదనీ, వారు కూడా సొంత అజెండాలతో సమావేశాలను అడ్డుకుంటున్నారని రాయపాటి మండిపడ్డారు.
నిజానికి, రాయపాటి చెబుతున్న ‘బురద’ను చంద్రబాబుకు అంటించింది మోడీ కాదు! చంద్రబాబు తనకు తానే దాన్ని పూసుకున్నారని చెప్పాలి! ఎందుకంటే, పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెనక తన సలహా ఉందని గతంలో చెప్పుకున్నారు. అవినీతి అంతానికి పెద్ద నోట్ల రద్దు ఒక్కటే మార్గమని తానే స్వయంగా ప్రధానికి లేఖ రాశానన్నారు. ఆ తరువాత, నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించాలనీ, డ్వాక్రా మహిళలకు మొబైల్ బ్యాంకింగ్ శిక్షణ అనీ, ఏపీ వ్యాలెట్ అనీ… ఇలా కేంద్రం కోరుకుంటున్న.. సారీ, మోడీ తాజాగా కలలు కంటున్న నగదు రహిత విధానాన్ని అత్యంత చురుగ్గా ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకునేందుకు పోటీ పడుతున్నారు. ఒకవేళ ఇదంతా బురద అనుకుంటే ఆయన మాత్రం ఇలా ఎందుకు పూసుకుంటారు..?
ఈ రోజు రాయపాటి… మొన్నటికి మొన్న మరో ఎంపీ శివ ప్రసాద్ కూడా మోడీని విమర్శించారు. అంతకుముందు, మరో నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి! నాయకులు మాత్రం ప్రజల కష్టాలను అడ్రస్ చేస్తూ కేంద్రాన్ని విమర్శిస్తారు. కానీ, చంద్రబాబు మాత్రం కేంద్రం అడుగులకు మడుగులు ఒత్తుతారు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై అవ్వా బువ్వా రెండూ కావాలనేట్టుగా తెలుగుదేశం వ్యవహరిస్తోందని చెప్పాలి!