చిత్రసీమ అసలే సంక్షోభంలో ఉంది. సినిమాలు చూడ్డానికి జనాలు రావడం లేదంటూ బోరుమంటున్నారు నిర్మాతలు. కానీ అదేం విచిత్రమో.. రీ రిలీజ్ అనేసరికి జనాలు పోటెత్తుతున్నారు. ఫ్లాప్ సినిమా కూడా రీ రిలీజ్ పేరుతో విడుదల చేస్తే, కోట్లు గుమ్మరిస్తున్నారు. శుక్రవారం ఖలేజాను 4కేలో విడుదల చేశారు. దానికి మంచి స్పందన వచ్చింది. హైదరాబాద్ లో ‘ఖలేజా’ ప్రదర్శించిన అన్ని థియేటర్లూ హౌస్ ఫుల్ బోర్డులతో కళకళలాడాయి. ప్రసాద్ ఐమాక్స్ లో బిగ్ స్క్రీన్ లో అన్ని షోలూ ఫుల్ అయ్యాయి. ఈరోజూ పరిస్థితి ఇలానే ఉంది. ఈ ఎఫెక్ట్ శుక్రవారం విడుదలైన ‘భైరవం’ సినిమాపై పడింది. రీ రిలీజులు కొత్త సినిమాల వసూళ్లని దెబ్బ తీస్తున్నాయన్న విషయం ‘ఖలేజా’తో మరోసారి అర్థమైంది.
రీ రిలీజులు తప్పేం కాదు. అదీ కావాలి. ఆ రూపంలో అయినా జనాలు థియేటర్లకు వస్తారు. కానీ ఓ పక్క కొత్త సినిమా విడుదలైనప్పుడు రీ రిలీజ్ చేస్తే, ఆ కొత్త సినిమా వసూళ్లు పలచబడుతున్నాయి. ఈ విషయంపై చాలా కాలంగా ఛాంబర్లో మీటింగులు జరుగుతున్నాయి. రీ రిలీజ్ లను అడ్డుకోలేరు కానీ, కనీసం రిలీజ్ డేట్ ని నియంత్రించొచ్చు. కొత్త సినిమాలు విడుదల కానప్పుడు రీ రిలీజ్ సినిమాని వదిలితే మంచిదన్న వాదన వినిపిస్తోంది. రీ రిలీజ్‌లకు వీక్ డేస్‌లోనే అనుమతి ఇవ్వాలన్న వాదన ఉంది. మంచు మనోజ్ కూడా ఇప్పుడు ఇదే మాట చెబుతున్నారు. రీ రీలీజ్ సినిమాల్ని ఎప్పుడు విడుదల చేసినా బజ్ ఉంటుందని, ఆ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటారని, అలాంటప్పుడు కొత్త సినిమాలపై ఆ ప్రభావం లేకుండా, వీక్ డేస్ లో విడుదల చేస్తే బాగుంటుందని, ఇది కలెక్టీవ్ గా తీసుకోవాల్సిన నిర్ణయం అని, ఛాంబర్ పెద్దలు ఈ దిశగా ఆలోచించాలని కోరారు.
కొంతమంది హీరోల ఫ్యాన్స్ కూడా ఈ రీ రిలీజ్‌ల ట్రెండ్ పై అభ్యంతరం చెబుతున్నారు. కేవలం వాణిజ్య ప్రయోజనాల కోసమే రీ రిలీజ్లు చేస్తే ఒప్పుకోమంటున్నారు. సినిమాల ద్వారా వచ్చే ఆదాయాన్ని, ఏమైనా మంచి పనుల కోసం ఉపయోగించాలని, అలాంటి సినిమాలకే తమ మద్దతు ఉంటుందని ఇది వరకే మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రకటించారు. మిగిలిన హీరోల ఫ్యాన్స్ కూడా ఇదే మాటపై కట్టుబడి ఉంటే బాగుణ్ణు అనిపిస్తోంది.