రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే నమ్మకం మీద ఆధారపడి ఉండేది. ఆ నమ్మకాన్ని పెంచుకోలేని సంస్థలు సినీ స్టార్లను ఆశ్రయిస్తాయి. ఆ సినీ స్టార్లకు కోట్లలో ముట్టచెబుతారు. వారు చేసే ప్రచారం కారణంగా ప్రాజెక్టుకు ఎంతో కొంత హైప్ వస్తుంది. సీనీ స్టార్ల రెమ్యూనరేషన్, ప్రచారం కోసం రియల్ ఎస్టేట్ సంస్థలు కోట్లు ఖర్చు పెడతాయి. దానికి తగ్గట్లుగా వారికి బుకింగ్స్ వస్తాయి.ఆ ప్రకటనల ఖర్చుతో పాటు ప్రాజెక్టు పనులు ప్రారంభించడానికి అవసరమైన సొమ్ము .. కొనుగోలుదారుల వద్ద నుంచే వసూలు చేస్తారు. అయితే అక్కడి నుంచి ఆ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి నమ్మకాన్ని పెంచుకుంటే ఇబ్బంది ఉండదు..కానీ ఇలా పూర్తి చేసే సంస్థలు చాలా తక్కువ.
మహేష్ బాబు గతంలో ఏపీలో రామకృష్ణ వెనుజుయా,తెలంగాణలో సాయి సూర్య అనే సంస్థలకు ప్రచారం చేశారు. ఈ రెండూ వినియోగదారులకు పీడకలగా మారాయి. ప్రాజెక్టుల్ని పూర్తి చేయలేకపోయాయి. కారణాలు వినియోగదారులకు అనవసరం. ఇప్పుడు కాసా గ్రాండ్ ఇద్దరు స్టార్లతో జోరుగా ప్రచారం చేస్తోంది. రెండు ప్రాజెక్టుల్ని ఒకే సారి ప్రకటించి నాని, వెంకటేష్ లతో ప్రచారం చేస్తోంది. అరచేతిలో వైకుంఠం మాదిరిగా గ్రాఫిక్స్ తో ఆ ప్రోమోలు ఉన్నాయి. వాటిని చూసి బుకింగ్ చేసేసుకుంటే.. పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. కాసా గ్రాండ్ సంస్థ గతంలో చేపట్టిన ప్రాజెక్టులు, కొనుగోలుదారుల ఫీడ్ బ్యాక్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటే మంచిది.
స్టార్లు ప్రచారం చేసి నష్టపోయిన ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఈ ట్రెండ్ ఉంది. నిజానికి నష్టపోతే స్టార్లకు ఏ సంబంధమూ ఉండదు. వారు ప్రచారకులు మాత్రమే. కొనేవారే అన్నీచూసుకోవాలి. ఒక్క కాసా గ్రాండ్ మాత్రమే కాదు.. స్టార్లతో ప్రచారం చేయించుకునే సంస్థల గురించి క్షణ్ణంగా తెలుసుకుని ప్రచారం చేసుకోవాలి. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి వనరులు ఉండి.. అనవసర ఖర్చులు తగ్గించుకునే సంస్థలకు క్రెడిబులిటీ ఉంటుంది. అలాంటి వారికి స్టార్ల ప్రచారం అవసరం ఉండదు.