ప్రముఖ ప్రాప్‌టెక్ ప్లాట్‌ఫారమ్ స్క్వేర్ యార్డ్స్ తన తాజా నివేదికలో 2026 భారత రియల్ ఎస్టేట్ మార్కెట్లో కీలక మార్పులను అంచనా వేసింది. గత ఐదేళ్లుగా రియల్ ఎస్టేట్ రంగాన్ని నడిపించిన లగ్జరీ ఇళ్ల జోరు ఇప్పుడు క్రమంగా స్థిరీకరణ దశకు చేరుకుంటోందని, ఈ ఏడాదిలో మధ్యతరహా ఆదాయ నివాసాలే వృద్ధికి ప్రధాన ఇంజిన్‌గా మారనున్నాయని పేర్కొంది. ముఖ్యంగా రూ. 80 లక్షల నుండి రూ. 1.5 కోట్ల ధరల శ్రేణిలో ఉన్న ఇళ్లకు గృహ కొనుగోలుదారుల నుండి అత్యధిక ఆదరణ లభించనుంది.
ఈ నివేదిక ప్రకారం, 2025లో గృహాల సగటు రిజిస్ట్రేషన్ విలువలు 22 శాతం పెరిగి సుమారు రూ. 81 లక్షలకు చేరుకున్నాయి. ధరల పెరుగుదల ,వడ్డీ రేట్ల ప్రభావంతో సామాన్యులకు ఇల్లు కొనడం భారంగా మారినప్పటికీ, స్థిరమైన ఆదాయం కలిగిన మధ్యతరగతి వర్గం ఇప్పుడు తమ బడ్జెట్‌కు అనుగుణంగా ఉండే క్వాలిటీ ప్రాజెక్టుల వైపు మొగ్గు చూపుతోంది. లగ్జరీ మార్కెట్ ఇప్పటికే గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో, డెవలపర్లు కూడా ఇప్పుడు మధ్యతరగతి ప్రజల అవసరాలకు తగ్గట్లుగా కొత్త ప్రాజెక్టులను డిజైన్ చేస్తున్నారు.
హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో గత ఐదేళ్లలో రియల్ ఎస్టేట్ ధరలు దాదాపు 50 శాతం పైగా పెరిగాయి. ఉదాహరణకు, హైదరాబాద్‌లో 2019లో చదరపు అడుగుకు రూ. 5,250 ఉన్న సగటు ధర, 2025 నాటికి రూ. 7,800కి చేరుకుంది. అధిక ధరల వల్ల లగ్జరీ ఇళ్ల అమ్మకాలు కొంత మందగించినా, ఎండ్-యూజర్స్ ఎక్కువగా ఉండే మిడ్-సెగ్మెంట్ లో లావాదేవీల సంఖ్య పెరుగుతుందని అంచనా. మౌలిక సదుపాయాల విస్తరణ ,మెరుగైన కనెక్టివిటీ ఉన్న శివారు ప్రాంతాల్లో ఈ రకమైన ఇళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉండనుంది.
2026 ఏడాది రియల్ ఎస్టేట్ రంగంలో విలువే ప్రాతిపదికగా సాగనుంది. కేవలం ఆడంబరాల కోసమే కాకుండా, సౌకర్యవంతమైన జీవనశైలిని అందించే సరసమైన లగ్జరీ ఇళ్లే మార్కెట్ వాటాను కైవసం చేసుకోనున్నాయి.