రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టేటప్పుడు సామాన్యులు చేసే అతిపెద్ద పొరపాటు తక్కువ ధర కు ఆశపడటం. నగరం లేదా ప్రధాన పట్టణాలకు 30 నుండి 40 కిలోమీటర్ల దూరంలో, ఎటువంటి మౌలిక సదుపాయాలు లేని చోట వెలిసే వెంచర్లలో ప్లాట్లు కొనడం సులభమే కానీ, వాటిని తిరిగి అమ్ముకోవడం మాత్రం ప్రాణసంకటంగా మారుతోంది. అభివృద్ధి చెందుతుందన్న ఆశతో కొన్న ప్లాట్లు పదేళ్లు గడిచినా అక్కడ ఎటువంటి నిర్మాణాలు రాకపోవడంతో, అత్యవసరానికి డబ్బు కావాల్సి వచ్చినప్పుడు ఆ ప్లాట్లు డెడ్ ఇన్వెస్ట్మెంట్ గా మారుతున్నాయి.
ఊరికి దూరంగా ఉండే వెంచర్లలో ప్రధాన సమస్య లిక్విడిటీ . అంటే, మన ఆస్తిని త్వరగా నగదుగా మార్చుకోలేకపోవడం. జనవాసం లేని చోట ప్లాట్ కొంటే, అక్కడ ఇల్లు కట్టుకునే వారు తక్కువగా ఉంటారు. కేవలం ఇన్వెస్టర్లు మాత్రమే ఇటువంటి చోట్ల ఆసక్తి చూపుతారు. అయితే, మార్కెట్ మందగించినప్పుడు లేదా కొత్త వెంచర్లు పక్కనే వచ్చినప్పుడు, పాత వెంచర్‌లోని మీ ప్లాట్‌ను ఎవరూ పట్టించుకోరు. దీనివల్ల మీరు ఆశించిన లాభం రాకపోగా, అసలు ధరకే అమ్ముకుందామన్నా కొనే నాథుడు ఉండడు. ప్లాట్ చుట్టూ పిచ్చిమొక్కలు మొలవడం తప్ప, అక్కడ విలువ పెరిగే సూచనలు కనిపించవు.
మరో ప్రధాన అడ్డంకి మౌలిక సదుపాయాలు . ఊరికి దూరంగా ఉన్న వెంచర్లలో విద్యుత్, నీటి సరఫరా, సరైన రోడ్లు , రవాణా సౌకర్యాలు రావడానికి దశాబ్దాల సమయం పడుతుంది. కొనుగోలుదారులు ఎప్పుడూ నివాస యోగ్యమైన ప్రాంతాలకే ప్రాధాన్యత ఇస్తారు. స్కూళ్లు, ఆసుపత్రులు , మార్కెట్లకు కనీసం 5-10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్లాట్లకు రీసేల్ వాల్యూ చాలా తక్కువగా ఉంటుంది. అమ్ముదామని బ్రోకర్లను సంప్రదించినా, వారు కూడా జనాభా ఉన్న ప్రాంతాలకే కస్టమర్లను తీసుకెళ్తారు తప్ప, అడవి లాంటి ప్రాంతాల్లో ఉన్న ప్లాట్లపై ఆసక్తి చూపరు.
తక్కువ ధరకు వస్తుందని దూరంగా ఉన్న ప్లాట్లు కొనేకంటే, బడ్జెట్ కొంచెం పెంచి అయినా జనవాసం ఉన్న చోట లేదా అభివృద్ధి చెందుతున్న ప్రధాన రహదారుల సమీపంలో చిన్న ప్లాట్ కొనడమే ఉత్తమం. ఆస్తి అనేది అవసరానికి ఆదుకోవాలి తప్ప, అమ్ముకోలేక గుదిబండలా మారకూడదని రియల్ ఎస్టేట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.


