రియల్ ఎస్టేట్ రంగంలో ప్రీ లాంచ్ ఆఫర్లు పెట్టుబడిదారులకు పీడకలగా మారాయి. నాలుగైదేళ్ల కిందట ప్రారంభమైన ట్రెండ్ ..నాలుగేళ్ల తర్వాత మోసాలుగా మారాయి. అప్పట్లో రెండు, మూడేళ్లలో ప్రాజెక్టును హ్యాండోవర్ చేస్తామని చెప్పి వేల మంది ఇళ్ల కొనుగోలుదారుల్ని మోసం చేశారు. ఈ విషయం నాలుగేళ్ల తర్వాతే వారికి అర్థమయింది. అప్పటికి వారి సొమ్ము కరిగిపోయింది. మోసం చేసిన వారు జైలుకు వెళ్లి.. బెయిల్ తెచ్చుకుని బయట తిరుగుతున్నారు. కానీ తమ కష్టాన్ని పోగొట్టుకున్న వారు మాత్రం ఇప్పటికి లబోదిబోమంటున్నారు.
ఇన్ని మోసాలు జరుగుతున్నా… ప్రీ లాంచ్ ఆఫర్లు పేరుతో డబ్బులు వసూలు చేయడం నేరం తెలిసినా కొన్ని బడా సంస్థలు మాత్రం వేర్వేరు పేర్లతో డబ్బులు వసూలు చేయడం మానడం లేదు. ఇటీవలి కాలంలో హైదారాబాద్లో ఇతర రాష్ట్రాలకు చెందిన బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు ప్రాజెక్టుల్ని ప్రకటిస్తున్నాయి. భూమి పూజ రోజే బుకింగ్ ల కోసం ఆరాటపడుతున్నాయి. నిబంధనలకు అనుగుణంగా. బుకింగ్లు తీసుకోవడం కాకుండా..భారీ ఆఫర్లతో వన్ టైమ్ పేమెంట్స్.. ఇతర అవకాశాలు కల్పించి భారీగా నగదు వసూలు చేస్తున్నాయి. ఆ డబ్బులతోనే ప్రాజెక్టును ముందుకు నడిపించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఇలా అయితే ఎప్పుడు అయితే అమ్మకాల్లో ఫ్లో తగ్గుతుందో అప్పుడు ప్రాజెక్టు ఆగిపోతుంది. ఒక వేళ ఆ కంపెనీకి ఇతర ప్రాజెక్టులు ఉంటే..ఇక్కడ వసూలు చేసిన డబ్బులు ఆయా ప్రాజెక్టుల్లోకి పంపింగ్ చేస్తున్నాయి. అక్కడ అమ్మకాలు జరిగితే ఇక్కడ నిర్మాణం కొనసాగించవచ్చని అనుకుంటున్నాయి. ఇది కూడా నిబంధనలకు విరుద్ధమే. కారణం ఏదైనా వినియోగదారులు ..ఎంత పెద్ద బ్రాండ్ అయినా గుడ్డిగా నమ్మడం వల్ల నష్టమే జరుగుతుంది. అందుకే ప్రీ లాంచ్ ఆఫర్ల పేర్లు ఏవైనా …ప్రాజెక్టు ప్రోగ్రెస్ లేకుండా డబ్బులు చెల్లించాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించడం బెటర్