రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలు చేయడానికి ఎన్ని క్రియేటివ్ మార్గాలను మోసగాళ్లు సృష్టించుకుంటారో అంచనా వేయడం కష్టం. ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో వేలకోట్లు కొల్లగొట్టేశారు. అయితే చాలా మంది గుర్తించలేకపోతున్న మరో మోసం.. వారి భూమిని కాకపోయినా అమ్మేసి డబ్బులు సంపాదించుకోవడం. ఇక్కడ నష్టపోయేవారు చదువుకు రాని వారు .. అత్యాశకుపోయేవారు మాత్రమే కాదు.. బాగా చదువుకున్నవారు. అన్నీతెలిసిన వారు కూడా.
కొన్నాళ్లకిందట హైడ్రా ప్రారంభించిన మొదట్లో కూల్చివేతలు చేపట్టినప్పుడు చెరువులో కట్టిన విల్లాలను కూల్చివేశారు. అంతకు ముందు రెండు సార్లు ఆ విల్లాలను కూల్చినా మళ్లీ కట్టి అమ్మేశారు. కానీ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లే కొన్నారు. తర్వాత ఓ సర్వే నెంబర్ ల్యాండ్ లో స్థలం కొని మరో సర్వే నెంబర్ లో ఇల్లు కట్టి అమ్మేశారు. దాన్ని కూడా హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. అక్కడ తమకు స్థలం లేకపోయినా బిల్డర్లు కట్టేసి అమ్మేశారు.
ప్రస్తుతం గాజులరామారంలోనూ అదే జరుగుతోంది. అదంతా ప్రభుత్వ స్థలం అని తెలిసి కూడా కొంత మంది రాజకీయ బలం ఉన్న వారు ఆక్రమించి.. వంద గజాల్లోపు ప్లాట్లుగా చేసి అమ్మేశారు. నిరుపేదలకు ఎక్కువగా అమ్మారు. పనులు చేసుకునేవారు.. వారికీ తెలుసు.. అది ప్రభుత్వ స్థలం అని. కానీ అమ్మిన వాళ్లు అండగా ఉంటారని.. ఎవరొచ్చినా.. చూసుకుంటారని అనుకున్నారు. కానీ అదేమీ లేకపోయింది. ఇప్పుడు వారు అన్నీ కోల్పోయారు.
ఆ పేదలకు వారు కట్టే ఐదు లక్షలు..కోటితో సమానం. ఇంటిల్లిపాది కాయకష్టం చేస్తే వచ్చే డబ్బులు అవి. అలాంటి మోసాలను మరింత సీరియస్ గా తీసుకోవాల్సి ఉంది. మోసం ఏదైనా మోసమే అవుతుంది.