రియల్ ఎస్టేట్‌కు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నా.. వడ్డీ రేట్లు తగ్గుతున్నా.. మార్కెట్ ఆశించినంతగా పెరగడం లేదు. దీనికి కారణం మధ్యతరగతి వర్గాలు ఇంకా ఇల్లు కొనుగోలు చేసేందుకు ముందుకు రాకపోవడమేనని భావిస్తున్నారు. ఓ వైపు ఐటీ రంగంలో ఏర్పడుతున్న సంక్షోభం కారణంగా హై కాస్ట్ ప్రాజెక్టులకు డిమాండ్ తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే అడ్వాన్సులు కట్టిన వాళ్లు కూడా క్యాన్సిల్ చేసుకుంటారన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇలాంటి సమయంలో మార్కెట్ లో డిమాండ్ కాస్త పెరగాలన్నా.. కనీసం తగ్గకుండా ఉండాలన్నా అందుబాటు ధరల్లో ఉండే ఇళ్ల నిర్మాణమే కీలకమని రియల్ ఎస్టేట్ వర్గాలు అంటున్నాయి. ఈ దిశగా దృష్టి సారించలేకపోవడానికి వారికి ప్రధానంగా భూమి విలువలే కారణంగా మారుతున్నాయి. ఊహించనంతగా పెరిగిపోయిన భూముల ధరల కారణంగా.. పెరిగిపోయిన నిర్మాణ విలువల కారణంగా తక్కువ ధరలకు ఇళ్లను అందించలేకపోతున్నట్లుగా బిల్డర్లు చెబుతున్నారు.
ప్రభుత్వం వందల కోట్లకు ఎకరాలకు ఎకరాలు వేలం వేసి డబ్బులు సంపాదించుకుంటోంది.. భూముల విలువలను మరింతగా పెంచుతోంది కానీ.. నిర్మాణ సంస్థలకు మధ్యతరగతి వారికి సరైన ధరలకు ఇళ్లు అమ్మేలా రూల్స్ పెట్టి.. కొన్ని రూల్స్ మార్చి భూమి కల్పిస్తే.. అలాంటి ప్రాజెక్టులు భారీగా కట్టవచ్చని అంటున్నారు. అప్పుడు రియల్ ఎస్టేట్ కు డిమాండ్ పెరుగుతుంది.. మార్కెట్ కూడా పెరుగుతుందని అంటున్నారు. ఇలా భూమిని కేటాయించడం వల్ల.. ప్రభుత్వానికి నష్టం ఉండదని.. రియల్ మార్కెట్ లో ప్రతి లావాదేవీ వల్ల ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తుందని చెబుతున్నారు.
జనాభాలో అత్యధికం మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారే. వారు యాక్టివ్ అయినప్పుడు మాత్రమే మార్కెట్ పుంజుకుంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.