టీవీల్లో వచ్చే రియాలిటీ షోలపై ఎవ్వరికీ నమ్మకాలు లేవు. పేరుకు మాత్రమే అందులో రియాలిటీ ఉంది. లోపలంతా స్క్రిప్టే. కనీసం యాంకర్లు వేసే పంచులు, చేసే చేష్టలు అన్నీ ముందే డిజైన్ చేసేస్తారు. ఎమోషనల్ డ్రామా పండించడం, కన్నీళ్లు పెట్టుకోవడం, సెట్లో తిట్టుకోవడం, అలిగి వెళ్లిపోవడం.. ఇవన్నీ పక్కా ప్లానింగ్ ప్రకారమే జరుగుతాయి. స్టార్ యాంకర్ ఉదయభాను కూడా ఈ విషయంలో కుండ బద్దలు కొట్టేశారు. రియాలిటీ షోల్లోని డొల్లతనం ఆమె బయట పెట్టారు. తెలుగు 360కి ఇచ్చిన ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో రియాలిటీ షోల గురించి ఆమె ప్రస్తావించారు. ఇక్కడంతా స్క్రిప్టే అని, అంతా ముందే డిజైన్ చేసేస్తారని, ఎప్పుడు ఏం చేయాలో చేవిలోని స్పీకర్ల ద్వారా దిశా నిర్దేశం చేస్తారని, దానికి తగ్గట్టుగానే యాంకర్లు ప్రవర్తిస్తారని చెప్పుకొచ్చారామె.
”ఈమధ్య కాలంలో రియాలిటీ షోలలో చాలా మార్పులొచ్చాయి. చెవిలో ఇయర్ ఫోన్స్ ద్వారా `’ఆవిడ్ని తిట్టండి.. ఇక్కడ నవ్వండి’ అంటూ చెబుతుంటారు. మనం చేయడానికి ఏం లేదు. అంతా స్క్రిప్టే. దేవుడి దయ వల్ల… నేనెప్పుడో ఇలాంటి షోలు చేయడం మానేశాను. మధ్యలో రెండు షోలు చేశాను. కానీ ఎందుకు చేశానా అంటూ ప్రశ్చాత్తాపం చెందాను” అని నిర్మొహమాటంగా తన మనసులోని మాటల్ని బయటపెట్టేశారు.
యాంకర్‌గా ఉదయభానుది స్టార్ హోదా. ఒకప్పుడు బుల్లితెర, సినిమా వేడుకలు ఎటు చూసినా ఆమెనే. కొంతకాలం పాటు ఏకఛత్రాధిపత్యం చెలాయించారు. కొన్ని ప్రత్యేక గీతాల్లో మెరిశారు. చాలా కాలం తరవాత ఇప్పుడు ‘బార్బరిక్’ చిత్రంలో ఓ కీలక పాత్రలో మెరవబోతున్నారు. ఈనెల 22న ఈ చిత్రం విడుదల కానుంది.