సచివాలయాన్ని కూల్చేయడానికి కేసీఆర్ సర్కారు సిద్ధమైన తీరు విమర్శలకు తావిస్తోంది. కేవలం వాస్తు కారణాల ఆధారంగా సెక్రటేరియట్‌ను కూల్చడం ఎంతవరకూ సబబు అనే ప్రశ్న వినిపిస్తోంది! ఇవాళ్ల కేసీఆర్ అధికారంలో ఉన్నారు కాబట్టి, ఆయన జాతక ప్రకారం సచివాలయ వాస్తు బాగులేదని కూల్చేసి.. కోట్ల ఖర్చుతో కొత్తది నిర్మిస్తారు! రేప్పొద్దున్న ఇంకో నాయకుడు ముఖ్యమంత్రి అయితే, ఆయన జాతకమూ సచివాలయ వాస్తుకు సరిపోకపోతే.. మళ్లీ కూల్చి కొత్తది నిర్మిస్తారా..? ప్రజాధనానికి కాపలాగా ఉండాల్సిన ముఖ్యమంత్రే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఏమనుకోవాలి..? సరే, వ్యవహారం కోర్టు దాకా వెళ్లింది కాబట్టి… అక్కడ వాస్తూ జాతకాలూ సెంటిమెంట్లూ అని చెబితే బాగోదు కాబట్టి, భద్రతా కారణాలను చూపింది తెరాస సర్కారు. ఫైర్ సేఫ్టీ లేదని, అందుకే కూల్చి కొత్తది నిర్మించాల్సిన అవసరం ఉందంటూ అగ్ని మాపక సిబ్బంది ఇచ్చిన సర్టిఫికేట్‌ను కూడా తన వాదనకు జత చేసింది.
సచివాలయ నిర్మాణాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. అయితే, వాస్తు దోషం కారణాన్ని చూపడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. పాత సెక్రటేరియట్ కూల్చడం వెనక ఓ సెంటిమెంట్‌ను ఎత్తి చూపుతోంది. ముఖ్యమంత్రి కుమారుడు రాష్ట్రానికి సీఎం అయిన చరిత్ర ఆ సచివాలయంలో లేదనీ, ఆ భయంతోనే కేసీఆర్ దాన్ని పడగొడుతున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నేతలు జీవన్ రెడ్డి, తదితరులు విమర్శించారు. వాస్తు దోషం వల్లనే ముఖ్యమంత్రి వారసులు రాష్ట్రానికి సీఎంలు కాలేకపోయారనీ, కొత్త భవనం నిర్మిస్తే వాస్తు సెట్ అయిపోతుందనీ, కేటీఆర్ సీఎం అయిపోతారని కేసీఆర్ నమ్ముతున్నారని విమర్శించారు.
అంతేకాదు, ఇప్పుడున్న సచివాలయాన్ని కొనసాగిస్తే మాజీ సీఎం దివంగత ఎన్టీఆర్‌కు పట్టిన తగే పడుతుందని భయపడుతున్నారట! ఎన్టీఆర్ తరువాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తెరమీదికి వచ్చారు. అలాగే, కేసీఆర్ తరువాత తన మేనల్లుడు హరీష్ రావు సీఎం కుర్చీని హైజాక్ చేసేస్తారన్న భయంతోనే సెక్రటేరియట్ వాస్తు మార్చుతున్నారంటూ ఆరోపించారు. హరీష్ రావును చూసి కేసీఆర్ భయపడుతున్నారనీ, అందుకే వాస్తు మార్పులు పేరుతో సచివాలయాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. తన కుమారుడికి సీఎం సీటు దక్కుతుందో లేదో అనేది ఆయన భయం అని దుమ్మెత్తి పోస్తున్నారు. మొత్తానికి, కాంగ్రెస్ నేతలు చెబుతున్న కారణం కాస్త ఆసక్తికరంగా ఉంది కదా!