ఏపీలో సంచలనం సృష్టించిన సుమారు రూ.3,570 కోట్ల మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ, ఈ కేసులో రెండో నిందితుడు అయిన వాసుదేవరెడ్డిని సిట్ అధికారులు శనివా అరెస్టు చేశారు. విజయవాడలోని ఏసీబీ కోర్టు ఆయనకు ఈ నెల 27 వరకు రిమాండ్ విధించడంతో, ఆయన్ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. విచారణకు సహకరిస్తున్నామని, అప్రూవర్లుగా మారతామని ఆయన తరపు న్యాయవాదులు కోర్టులో వాదించినప్పటికీ, న్యాయస్థానం ఆ వాదనలను తోసిపుచ్చింది.
అప్రూవర్ వాదనను కోర్టు ఎందుకు తోసిపుచ్చింది?
వాసుదేవరెడ్డి గత కొంతకాలంగా తాను దర్యాప్తుకు సహకరిస్తున్నానని, అప్రూవర్‌గా మారుతానని కోర్టులో పేర్కొంటూ వస్తున్నారు. అయితే, సెక్షన్ 306(4)(B) ప్రకారం అప్రూవర్‌గా మారేందుకు సిద్ధమైన వ్యక్తులకు కూడా విచారణ ముగిసే వరకు ముందస్తు బెయిల్ ఇచ్చే అవకాశం లేదని న్యాయస్థానం గతంలోనే స్పష్టం చేసింది. ఆయన ఇచ్చే సాక్ష్యం ఇతర నిందితుల ప్రభావానికి లోనుకాకుండా ఉండాలంటే అరెస్టు అనివార్యమని సిట్ భావించింది. ప్రధానంగా రాజకీయం పెద్దల అండతో వ్యవస్థను నిర్వీర్యం చేసిన ఆయనను బయట ఉంచితే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని దర్యాప్తు సంస్థ గట్టిగా వాదించింది.
సత్యప్రసాద్ అరెస్టు ఎందుకు కాలేదు?
ఈ కేసులో మూడో నిందితుడు అయిన ఎక్సైజ్ శాఖ మాజీ ప్రత్యేకాధికారి దొడ్డా వెంకట సత్యప్రసాద్ పరిస్థితిపై ప్రస్తుతం సందిగ్ధత నెలకొంది. వాసుదేవరెడ్డి అరెస్టు తర్వాత సత్యప్రసాద్‌ను కూడా త్వరలోనే అరెస్టు చేసే అవకాశం ఉందని సిట్ వర్గాలు సంకేతాలిస్తున్నాయి. అయితే, సత్యప్రసాద్ ముందస్తు బెయిల్ పిటిషన్లను కోర్టు ఇదివరకే తిరస్కరించినప్పటికీ, ఆయనపై సిట్ ప్రస్తుతానికి ఎందుకు కఠిన చర్యలు తీసుకోలేదనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆయన కూడా అప్రూవర్‌గా మారేందుకు సుముఖత వ్యక్తం చేయడం, దానికి సంబంధించిన న్యాయ ప్రక్రియ , ప్రభుత్వ అనుమతుల కోసం వేచి చూడటం వల్లనే అరెస్టు ఆలస్యమవుతుండవచ్చని భావిస్తున్నారు.
సిట్ నివేదికలో విస్తుపోయే నిజాలు
వాసుదేవరెడ్డిపై దాఖలైన రిమాండ్ రిపోర్టులో సిట్ కీలక అంశాలను పొందుపరిచింది. ఎటువంటి అనుమతులు లేకుండానే ఆన్లైన్ మద్యం అమ్మకాలను మ్యాన్యువల్ విధానంలోకి మార్చడం ద్వారా అక్రమాలకు తెరలేపారని అధికారులు గుర్తించారు. కంపెనీలను బెదిరించి, ప్రతి నెల 60 కోట్ల మేర కమీషన్లు వసూలు చేసి రాజకీయ పెద్దలకు చేరవేసినట్లు ఆధారాలు సేకరించారు. ప్రభుత్వ ఖజానాకు కేవలం నేరుగా 192 కోట్ల నష్టం వాటిల్లడమే కాకుండా, సిండికేట్ల ద్వారా వేల కోట్ల మేర ప్రజాధనం దారి మళ్లించడంలో వాసుదేవరెడ్డిది ‘తల’ లాంటి పాత్ర అని ఏసీబీ కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఇప్పటికే మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి సన్నిహితులైన పలువురు ఉన్నతాధికారులు, రాజకీయ నేతల పేర్లు ఈ కుంభకోణంలో వెలుగులోకి వచ్చాయి. వాసుదేవరెడ్డి అరెస్టుతో ఈ కేసులో అంతిమ లబ్ధిదారులు ఎవరనే దానిపై మరిన్ని కీలక ఆధారాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
