2025లో ‘విశ్వంభర’ రాదని తేలిపోయింది. వచ్చే యేడాది వేసవిలో ఈ సినిమాని విడుదల చేస్తామని మెగాస్టార్ చిరంజీవి ప్రకటించేశారు. ఈ సినిమా ఎందుకు ఆలస్యం అవుతుందో క్లారిటీ ఇచ్చేశారు. విజువల్ ఎఫెక్ట్స్ కి ప్రాధాన్యం ఉన్న చిత్రమిది. దానికి సంబంధించిన వర్క్ ఎప్పటికప్పుడు ఆలస్యం అవుతూనే ఉంటుంది. కాబట్టి.. ఈ డిలే.. అంటూ చిరంజీవి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు.
కాకపోతే ఇన్ సైడ్ వర్గాల సమాచారం ప్రకారం… ఈ సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ రెడీ అయిపోయాయట. సినిమా మొత్తం చేతిలోనే ఉందని, అయినా సరే.. విడుదల వాయిదా పడిందని తెలుస్తోంది. అక్టోబరులో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు కూడా రెడీ అయ్యారని, కానీ.. చివరి క్షణంలో చిత్రాన్ని వాయిదా వేయాల్సివచ్చిందని సమాచారం.
దానికి రెండు కారణాలు ఉన్నాయి. ‘విశ్వంభర’ ఓటీటీ డీల్ ఇంకా క్లోజ్ కాలేదు. దానికి తోడు.. 2025లో ఏ స్లాట్ కూడా ఖాళీగా లేదు. రాబోయే సీజన్.. దసరా మాత్రమే. అది మినహాయిస్తే పెద్ద సీజన్ ఏదీ లేదు. ఒకవేళ డిసెంబరు లో వద్దామనుకొంటే, సంక్రాంతికి నెల రోజుల వ్యవధి కూడా ఉండదు. నెల రోజుల గ్యాప్ లో చిరు నటించిన రెండు సినిమాలు రావడం కూడా ఇబ్బందే. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాపై చిరుకి గట్టి నమ్మకం ఉంది. ఆ సినిమా తప్పకుండా హిట్ అవుతుందన్నది చిరు భరోసా. సంక్రాంతి బరిలో ఉంది కాబట్టి, హిట్ టాక్ వస్తే వసూళ్ల వరద ఖాయం. అన్నీ అనుకొన్నట్టు జరిగితే.. సంక్రాంతికి చిరు సినిమా పెద్ద హిట్ తన ఖాతాలో వేసుకొంటుంది. ఆ తరవాత వచ్చే ‘విశ్వంభర’కు ఆ మైలేజీ కలిసి వస్తుంది. కాబట్టి చిరు ఈ నిర్ణయం తీసుకొని ఉంటారని ఇన్ సైడ్ వర్గాలు చెబుతన్నాయి. పైగా.. వీఎఫ్ఎక్స్ లో చిన్న చిన్న సర్దుబాట్లూ, లోటు పాట్లు ఉంటే సరి చేసుకోవడానికి కావల్సినంత సమయం ఉంటుంది. వేసవి సీజన్ లో ‘చందమామ కథ’లాంటి సినిమా విడుదల చేస్తే… అది వసూళ్లకు మరింత మేలు చేస్తుంది. ఇన్ని రకాలుగా ఆలోచించారు కాబట్టే.. ‘విశ్వంభర’ వేసవికి షిఫ్ట్ అయిపోయిందని, లేదంటే.. ఈ దసరాలోగా పలకరించేదని ఫిల్మ్ నగర్ వర్గాలు భావిస్తున్నాయి.