కాటమరాయుడు సెట్స్లోంచి పవన్ కల్యాణ్ అర్థాంతరంగా వెళ్లిపోవడం, షూటింగ్‌ని బాయ్ కాట్ చేయడం చిత్రసీమిని పెద్దగా ఆశ్చర్యంలో ముంచేయలేదు. పవన్ వ్యవహార శైలి గురించి తెలిసిన వాళ్లంతా `ఇలాంటిదేదో జరుగుతుందని తెలుసులే` అని లైట్ తీసుకొన్నారు. అయితే… తెర వెనుక, సెట్లో ఏం జరిగిందన్న ఉత్సుకత మాత్రం బాగానే చూపిస్తున్నారు. పవన్ కోపానికి కారణం ఏమిటా?? అని ఆరా తీస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం డాలీకీ – పవన్‌కీ మధ్య `క్లారిటీ` విషయంలో కాస్త కమ్యునికేషన్ గ్యాప్ వచ్చిందని తెలుస్తోంది. పవన్‌కి ఇచ్చిన సీన్.. అక్కడ తీస్తున్న సీన్ రెండింటికీ పోలిక లేకపోవడం, డైలాగుల్ని అప్పటికప్పుడు మార్చి.. కొత్త డైలాగులు చెప్పమనడం పవన్‌కి నచ్చలేదట. అందుకే… `ఏం జరుగుతోందిక్కడ.. మీకు క్లారిటీ ఉందా` అంటూ కాస్త గట్టిగా క్లాస్పీకి అక్కడి నుంచి వెళ్లిపోయాడని తెలుస్తోంది.
నిజానికి పవన్ కల్యాణ్ తో పని చేయడం ఒక విధంగా రిస్క్ తో కూడుకొన్న వ్యవహారం. పవన్ డైరెక్టర్లంతా ఆయన సలహాలూ, సూచనలకు అనుగుణంగా ‘యాక్షన్… కట్’లు చెప్పుకోవాల్సిందే. అంతేకాదు.. రేపటి సీన్ ఏంటన్నది పవన్ ఈరోజే డిసైడ్ చేస్తుంటాడు. ఆ పద్ధతికి డాలీ అలవాటు పడలేదేమో..?? గోపాల గోపాల సినిమాకి డాలీ దర్శకత్వం వహించినా.. అక్కడ పవన్ హుకుం ఏం నడవలేదు. దానికి కారణం.. డి.సురేష్‌బాబు లాంటి నిర్మాత సెట్లో ఉండడమే. స్క్రిప్టు పక్కగా అయిన తరవాత గోపాల గోపాల షూటింగ్ మొదలెట్టారు. మొదలెట్టాక మార్పులూ, చేర్పులూ జరగలేదు. పవన్ కూడా ఆ సినిమా విషయంలో ఏం కలగచేసుకోలేదు. కాబట్టి డాలీకీ పవన్‌కి మధ్య అంతా హ్యాపీగా సాగిపోయింది. కానీ కాటమరాయుడు పరిస్థితి వేరు. ఈ సినిమాకి కర్త కర్మ క్రియ అంతా పవన్ కల్యాణే. ఆయన చెప్పినట్టు అంతా నడుచుకోవాలి.. ఈ విషయం తెలీక, పవన్ స్కూల్ ఎలా ఉంటుందో అర్థం కాక డాలీ కాస్త కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు… అక్కడే వ్యవహారం మొత్తం ఫ్యూజ్ కొట్టేసింది. అక్కడికీ పవన్ ఏం చెబితే అది చేయడానికి డాలీ సిద్దమయ్యాడట. కాకపోతే…ఆ రోజు సీన్ విషయంలో మాత్రం పవన్‌కి చెప్పకుండా సొంత తడాఖా చూపిద్దామనుకొన్నాడు. అక్కడే వ్యవహారం బెడసి కొట్టింది. దర్శకుడి పనిలో ఏమాత్రం జోక్యం చేసుకోను అని తరచూ చెబుతుంటాడు పవన్. ఆ మాటలు కేవలం మాటల వరకే అని ఇలాంటి ఉదంతాలు చాటి చెబుతుంటాయి. దర్శకుడి పనేంటి? సెట్లో తన పనేంటి ? అనే విషయంలో పవన్‌కీ కాస్త క్లారిటీ వస్తే.. ఇలాంటి గొడవలే ఉండవు.