ముంబైలో పెద్ద పెద్ద స్టార్స్, వ్యాపారవేత్తలు అందరూ అపార్టుమెంట్లలోనే ఉంటారు. యూట్యూబ్ లో హోమ్ టూర్లు చేసినప్పుడు నాలుగైదు బెడ్రూం ఫ్లాట్లలోనే ఉంటున్నట్లుగా తెలిసిపోతుంది. ఇంకా కాస్త విశాలంగా కావాలనుకుంటే మరో ఫ్లాట్ తీసుకుంటారు. వారి ఆస్తులన్నీ అపార్టుమెంట్లలోనే ఉంటాయి. ఎంత పెద్ద కుబేరులైనా ఎందుకు సొంత బంగ్లాల్లో నివసించరనేది చాలా మందికి అర్థం కాని విషయం. దశాబ్దాలుగా అక్కడ స్థిరపడిన కుబేరులు కొంత మందికి మాత్రమే బంగ్లాలు ఉన్నాయి.
ముంబైలో అపార్టుమెంట్లే వందల కోట్లు పలుకుతున్న వార్తలూ చదువుతూంటాం. దీనికి కారణం ముంబై ఒక ద్వీప నగరం లాంటిది కావడమే. ముంబై విస్తీర్ణం కేవలం 603 చదరపు కిలోమీటర్లు మాత్రమే. భూమి అత్యంత పరిమితంగా ఉండటం వల్ల స్వతంత్ర ఇళ్లు లేదా విల్లాల నిర్మాణం చాలా ఖరీదైనది. అందుకే, హై-రైజ్ అపార్ట్మెంట్లు నివాస అవసరాలను తీరుస్తున్నాయి. సౌత్ ముంబై, వర్లీ, బాంద్రా, జుహు వంటి ప్రైమ్ ప్రాంతాల్లో భూమి ధరలు స్క్వేర్ ఫీటుకు లక్షల్లో ఉంటుంది.
ముంబై జనాభా సాంద్రత చదరపు కిలోమీటరుకు సుమారు 21,000 మంది, ఇది దేశంలో అత్యధికం. ఈ జనాభా ఒత్తిడి వల్ల భూమిని సమర్థవంతంగా ఉపయోగించడానికి బహుళ అంతస్తుల భవనాలు నిర్మించడం అవసరం అయింది. తప్పనిసరిగా ధనవంతులు అపార్టుమెంట్లలోనే లగ్జరీని చూసుకుంటున్నారు. ఈ అపార్ట్మెంట్లు సాధారణంగా 3 BHK నుండి 5 BHK వరకు ఉంటాయి, ధరలు 5 కోట్ల రూపాయల నుండి 50 కోట్ల రూపాయల వరకు ఉంటాయి, ఇవి ధనవంతుల జీవనశైలికి సరిపోతాయి.
ముంబై ఒక ఫాస్ట్-పేస్డ్ నగరం, ఇక్కడ వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు, ఉన్నత ఆదాయ వర్గాలు నగర కేంద్రంలో లేదా సమీపంలో ఉండటానికి ఇష్టపడతారు. అలాగే ముంబైలో లగ్జరీ అపార్ట్మెంట్లు సామాజిక హోదాకు చిహ్నంగా మారిపోయాయి. లగ్జరీ టవర్స్ లో నివసించడం ఒక స్టేటస్ సింబల్‌గా మారింది. అందుకే – ముంబైలో అపార్ట్మెంట్ జీవన శైలికి ధనవంతులు కూడా అలవాటు పడ్డారు.