అవినీతికి నిర్లక్ష్యం తోడు..! బోటు విషాదం అక్షరాలా మానవ తప్పిదమే..!

గోదావరిలో ఐదు లక్షల క్యూసెక్కులు ప్రవాహం ఉంది. అయినా పర్యాటకుల్ని తీసుకుని బోట్లు వెళ్తున్నాయి. చాలా ప్రమాదం అని.. పత్రికలు…ఆదివారం ఉదయమే ప్రచురించాయి. శనివారం పర్యాటకుల్ని తీసుకెళ్లిన బోటు.. ఎంత ప్రమాదకర పరిస్థితుల్లో వెళ్లిందో.. ఫోటో తీసి.. ఆంధ్రజ్యోతి పత్రికలో కథనం ప్రచురించింది. అధికారులు స్పందించి తక్షణం ఆపాలని.. లేకపోతే పెను విషాదం తప్పదని.. హెచ్చరించింది. కానీ… అధికారులంతా.. లైట్ తీసుకున్నారు. ఎవరి వాటా వారికి అందుతుందని.. గుండెల మీద చేయి వేసుకున్నారు. కానీ.. ఇప్పుడు… 50 కుటుంబాలు గుండెలవిసేలా రోదిస్తున్నాయి.

లంచాలు మరిగిన ఆఫీసర్లే మొదటి ముద్దాయిలు..!

బోటుకు పర్మిషన్ లేదు…! వరద వచ్చేటప్పుడు జలరవాణా చేయకూడదు..! .. టీడీపీ హయాంలోనే ఆ బోటుకు లైసెన్స్ ఇచ్చారు..!.. ఇలాంటి కబుర్లు ఎన్ని చెప్పినా.. జరిగి పోయిన ప్రమాదంలో పోయిన ప్రాణాలు వెనక్కి తీసుకురాలేరు. కానీ..అసలు తప్పెక్కడ జరిగిందో తెలుసుకుని… నిందితుల్ని మాత్రం కఠినంగా శిక్షించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ముందుగా… దేవీపట్నం దగ్గర లాంచీలు నదిలోకి వెళ్లకుండా.. నియంత్రించాల్సిన అధికారులదే మొదటి తప్పు. కానీ.. అనాదిగా.. లాంచీ యజమానుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి… అదే తమ విధి నిర్వహణ అనుకునే అధికారులు పట్టించుకోలేదు. నిబంధనల ప్రకారం.. విధిగా.. గోదావరిలోకి వెళ్లే బోట్లను .. ముఖ్యంగా పర్యాటక బోట్లను క్షణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత నదిలోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలి. అక్కడ అలాంటివేమీ జరగలేదు.

ప్రమాదం జరిగే వరకూ జగన్ పాత హామీలన్నింటినీ ఎందుకు మార్చిపోయారు..?

గతంలో పడవ ప్రమాదాలు జరిగినప్పుడు.. ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి చాలా చాలా విమర్శలు చేశారు. అవినీతిని అంతం చేసి.. ప్రజల ప్రాణాలు కాపడతానని.. శపథాలు చేశారు. అయితే… ఆయన పాలనలో తొలి పడవ ప్రమాదం జరిగే వరకు నాలుగు నెలల కాలంలో.. ఒక్కటంటే.. ఒక్క సారి కూడా కృష్ణా, గోదావరి పడవ ప్రమాదాల గురంచి కనీసం ఆలోచన చేయలేదు. రేవుల్లో అవినీతి లేకుండా ఎలా చేయాలి..? పర్యాటకుల ప్రాణాలు కాపాడేందుకు ఏం చేయాలో ఆలోచించలేదు. కానీ ప్రమాదం జరిగింది.. ఒక్క సారిగా గోదావరిలో 50 ప్రాణాలు గల్లంతయిన తర్వాత ఆయన స్పందించారు. బోట్లన్నీ నిలిపి వేయాలని… లైసెన్సులు చెక్ చేయాలని ఆదేశించారు. ఇదేదో… గతంలో తన మాటకు కట్టుబడి ముందే చేసినట్లయితే.. ఈ యాభై ప్రాణాలు మిగిలి ఉండేవి కదా..!

మృతుల కుటుంబీకుల కన్నీళ్లతో రాజకీయం మాని .. మళ్లీ మళ్లీ జరగకుండా చూడాలి..!

గోదావరి తీరాన ఇప్పుడు కనిపిస్తోంది హృదయవిదారక దృశ్యాలు. విహారయాత్రకు భర్త, బిడ్డతో కలిసి వచ్చిన ఓ యువతి.. ఒంటరిగా కుమిలి కుమిలి ఏడుస్తోంది. రక్త సంబంధీకులంతా… జలసమాధి అయితే.. వారి ఆచూకీ తెలియక.. బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు మరికొందరు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయం చేయాలనే ఎవరికీ రాకూడదు. రాజకీయం చేస్తే.. అంత కంటే రాక్షసులు ఉండరు. కానీ.. ఇలాంటి తప్పిదం మరోసారి జరగకుండా ఉండాలంటే… తక్షణం… బాధ్యలుపై చర్యలు తీసుకోవాలి. రక్షణ ఏర్పాట్లు కఠినం చేయాలి. దీని వదిలేసి.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటే.. అంత కంటే బాధ్యతా రాహిత్యం మరొకటి ఉండదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com